శ్రీకృష్ణుడి చేతిలోకి శంఖం ఎలా వచ్చింది ?

శ్రీకృష్ణుడి చేతిలోకి శంఖం ఎలా వచ్చింది ?
శ్రీకృష్ణుడి చేతిలోగల శంఖానికి 'పాంచజన్యం' అని పేరు. శత్రువులను సంహరించడానికి ముందు పలుమార్లు శ్రీకృష్ణుడు ఈ శంఖాన్ని పూరించినట్టు పురాణాలు చెబుతున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలోను యుద్ధ సమయాన్ని సూచిస్తూ శ్రీకృష్ణుడు ఈ శంఖాన్ని పూరించాడు. ఇంతటి విశిష్టమైన శంఖం శ్రీకృష్ణుడికి ఎలా లభించిందనే ప్రశ్నకి సమాధానంగా పురాణపరమైన ఓ కథ ఆసక్తికరంగా వినిపిస్తుంది.

శ్రీకృష్ణుడు - బలరాముడు సాందీపనీ మహర్షి చెంత విద్యను అభ్యసిస్తారు. యుక్త వయసుకి వచ్చే సరికి సమస్త శాస్త్రాల సారాన్ని గ్రహిస్తారు. గురుదక్షిణగా ఏంకావాలో అడగమని సాందీపుడిని కోరతారు. చాలాకాలం క్రిందట పసివాడైన తన కుమారుడిని సముద్రుడు పొట్టన పెట్టుకున్నాడనీ, అప్పటి నుంచి తన భార్య నిరంతరం దుఃఖిస్తూనే ఉందని సాందీపుడు ఆవేదన వ్యక్తం చేస్తాడు. సాధ్యమైతే తన పుత్ర్హ్రుడిని తమ దగ్గరికి చేర్చమని కోరతాడు.

దాంతో శ్రీకృష్ణుడు ఆ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తాడు. సాందీపుడి కుమారుడిని కబళించిన 'పంచజనుడు' అనే రాక్షసుడుని సంహరిస్తాడు. ఆ సమయంలోనే ఆ రాక్షసుడి గర్భంలో శ్రీకృష్ణుడికి శంఖం లభిస్తుంది. పంచజనుడి గర్భంలో లభించింది కనుకనే అది పాంచజన్యంగా పిలవబడుతోంది. అక్కడి నుంచి యమలోకానికి వెళ్లిన శ్రీకృష్ణుడు యమధర్మరాజుని మెప్పించి సాందీపుడి కుమారుడిని సజీవుడిని చేసి తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పిస్తాడు.

More Bhakti Articles