సుబ్రహ్మణ్యస్వామి వివాహం జరిగిన ప్రదేశం

సుబ్రహ్మణ్యస్వామి వివాహం జరిగిన ప్రదేశం
శివపార్వతుల కుమారుడిగా జన్మించిన సుబ్రహ్మణ్యస్వామి అనేక నామాలతో వివిధ ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. మహా పరాక్రమశాలి అయిన సుబ్రహ్మణ్యుడు, దేవతల ఆధిపత్యానికి అడ్డుపడటానికి ప్రయత్నించిన అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దేవేంద్రుడికి కూడా సాయపడ్డాడు. ఇంద్ర పదవికి ఎసరు పెట్టడానికి ప్రయత్నించిన శూరపద్ముడిని సంహరించి, దేవేంద్రుడికి అండగా నిలిచాడు.

అందుకు కృతజ్ఞతగా తన కూతురైన దేవసేనను సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఇంద్రుడు. సమస్త దేవతల సమక్షంలో ఆ వివాహం జరిగిన ప్రదేశమే నేటి 'తిరుప్పరంకున్రం' క్షేత్రం. ఇంతటి పౌరాణిక నేపథ్యం గల ఈ క్షేత్రాన్ని ఎంతోమంది రాజులు దర్శించారు ... ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేశారు. ఆలయ వైశాల్యం ... ప్రాకారాలు ... గోపురాలు ... మంటపాలు అపూర్వమైన ఆనాటి శిల్పకళను ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఆనాటి ప్రభువులకు గల దైవభక్తికి నిలువెత్తు నిదర్శనమై నిలుస్తుంటాయి.

గర్భాలయంలో దేవసేన - సుబ్రమణ్యస్వామి దంపతుల పక్కనే నారదమహర్షి కూడా దర్శనమిస్తూ ఉంటాడు. గర్భాలయంలోకి చూసిన భక్తులకు దేవసేన - సుబ్రహ్మణ్యుడు నూతన దంపతులుగానే కళకళలాడుతూ కనిపిస్తుంటారు. ఇక్కడ స్వామి కూర్చుని ఉండటం ... అభిషేకాలు ఆయన శూలానికి జరపడం విశేషంగా చెబుతారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన నాగ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు.

'శరవణపొయ్ గై' పేరుతో పిలవబడే ఇక్కడి పుష్కరిణి మహిమాన్వితమైనదని చెబుతుంటారు. ఈ పుష్కరిణిలో స్నానమాచరించడం వలన చర్మ సంబంధమైన వ్యాధులు నివారించబడతాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి కోరిక మేరకు పార్వతీ పరమేశ్వరులు ఇదే ప్రాంగణంలో కొలువుదీరి కనిపిస్తుంటారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా శివుడిని దర్శించుకున్న తరువాతనే సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోంది.

More Bhakti Articles