అహంకారాన్ని దైవం ఉపేక్షిస్తుందా ?

అహంకారాన్ని దైవం ఉపేక్షిస్తుందా ?
అణకువతో సాధించనిది లేదు ... అహంకారంతో కోల్పోనిది లేదు అనే సత్యం పురాణకాలం నుంచి వినిపిస్తూనే ఉంది. అణకువ జ్ఞానాన్ని ... దాని ద్వారా లభించే పరిపక్వతను సూచిస్తూ ఉంటుంది. ఇక అహంకారమనేది అజ్ఞానాన్ని సూచిస్తూ ఉంటుంది. సర్వం నేనే ... సకల నేనే అనే భావనలో నుంచి పుట్టే అహంకారం అంతకంతకూ పెరిగిపోతూనే ఉంటుంది. దీనిని మొగ్గ దశలోనే తుంచివేయకపోతే అది అనేక అనర్థాలకు దారితీస్తూ ఉంటుంది.

అందుకు ఉదాహరణగా మనకి 'పౌండ్రక వాసుదేవుడు' చరిత్ర కనిపిస్తూ ఉంటుంది. పౌండ్రక వాసుదేవుడు అన్నివిధాలా శ్రీకృష్ణుడిని అనుసరిస్తూ ఉండేవాడు. అసలైన వాసుదేవుడిని తానేనంటూ ప్రచారం చేసుకునేవాడు. వాసుదేవుడు అనే పేరుతో తనని మాత్రమే పిలవాలని ప్రజలను నానాఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. ఈ విషయం కృష్ణుడి దృష్టికి వచ్చినా, పిచ్చుక పై బ్రహ్మాస్త్రం ఎందుకన్నట్టుగా ఆయన పెద్దగా పట్టించుకోడు.

దాంతో పౌండ్రక వాసుదేవుడు మరింత రెచ్చిపోతాడు. తన పేరు పెట్టుకుని ప్రజలను మభ్యపెడుతున్నావంటూ నేరుగా శ్రీకృష్ణుడితోనే గొడవకి దిగుతాడు. తాను వాసుదేవుడిననే విషయాన్ని అంగీకరిస్తూ, పేరు మార్చుకోమని పట్టుబడతాడు. పౌండ్రక వాసుదేవుడి వ్యవహారం వలన సాధారణ ప్రజలు బాధలుపడుతూ ఉండటాన్ని గమనిస్తూ వస్తోన్న శ్రీ కృష్ణుడు, అతని వ్యవహారం శృతిమించడంతో సహనం కోల్పోతాడు.

తనని ఎదిరించాడనే కారణంగా కాకుండా ప్రజల శ్రేయస్సు కోసం పౌండ్రక వాసుదేవుడిని చక్రాయుధంతో సంహరిస్తాడు. అహంకారం భగవంతుడి కంటే బలవంతులమనే నమ్మకాన్ని కలిగిస్తుంది ... అది పతనం వైపు పరుగులు తీయిస్తుంది. ఇందుకు పౌండ్రక వాసుదేవుడి చరిత్ర నిలువెత్తు నిదర్శనమని తెలియజేస్తుంది.

More Bhakti Articles