ఆవేశంతో లంకను విడిచి వచ్చిన అమ్మవారు

ఆవేశంతో లంకను విడిచి వచ్చిన అమ్మవారు
శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి పాలాభిషేకం అంటే ఇష్టం ... పాలతో చేయబడిన పాయసం అంటే ఇష్టమని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలా పాల పాయసాన్ని నైవేద్యంగా అందుకుంటూ, పాల రంగును పోలిన నీటిలో నివసిస్తూ ఉండే అమ్మవారు కాశ్మీర్ లో కనిపిస్తుంది. ఈ కారణంగానే ఇక్కడి అమ్మవారిని 'ఖీర్ భవానీదేవి' గా పిలుస్తుంటారు.

గర్భాలయంలో ఓ వైపున లింగరూపంలోగల శివుడు ... మరో వైపున భవానీదేవి ఉండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. ఇక ఈ క్షేత్రానికి గల మరో ప్రత్యేకత ఏమిటంటే, అమ్మవారి ఆలయం నీటి మధ్యలో ఉంటుంది. చిన్నపాటి కోనేరును తలపించే ఇక్కడి జలాశయంలోని నీరు రంగులు మారుతూ ఉంటుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు ఈ నీటిలో 'శ్రీ చక్రం' ఆకృతిలో నీటిబుడగలు కనిపిస్తూ ఉంటాయట. అందువలన ఈ కోనేరు మహిమాన్వితమైనదని స్థలపురాణం చెబుతోంది.

ఇక ఈ అమ్మవారు అంతకుముందు రావణాసురుడి అంతఃపుర మందిరంలో ఉండేదట. రావణుడు సీతను అపహరించడం నచ్చని అమ్మవారు లంకానగరాన్ని విడిచి ఇక్కడికి వచ్చిందని అంటారు. మహా శక్తి వదిలి వచ్చేసిన కారణంగానే రావణుడు పతనమయ్యాడని అంటారు. ఓ భక్తుడికి తన జాడను తెలిపి వెలుగులోకి వచ్చిన ఇక్కడి అమ్మవారికి 19 వ శతాబ్దం తొలినాళ్లలో 'రాణాప్రతాప్ సింగ్' ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి.

ఆనాటి నుంచి ఇక్కడి అమ్మవారికీ ... అయ్యవారికి పూజాభిషేకాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. అమ్మవారికి సమర్పించబడిన పాల పాయసాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రాన్ని మహిళా భక్తులు ఎక్కువగా దర్శిస్తూ ఉంటారు. ఆ తల్లి అనుగ్రహం దక్కితే సౌభాగ్యం సుస్థిరమవుతుందని విశ్వసిస్తూ ఉంటారు.

More Bhakti Articles