కోరికలు తీర్చేటి కొండమీది దేవుడు

కోరికలు తీర్చేటి కొండమీది దేవుడు
లోక కల్యాణం కోసం శివపార్వతుల పుత్రుడిగా జన్మించాడు కుమారస్వామి. దేవతల సైన్యాధిపతిగా నిలిచి, అసుర సంహారం చేసిన మహా పరాక్రమశాలి ఆయన. తండ్రివలే తన భక్తులకు అండగా నిలవడానికీ ... తల్లివలె అనురాగాన్ని అందించడానికి భూలోకంలోని అనేక ప్రదేశాల్లో ఆయన ఆవిర్భవించాడు. అలా ఆయన కొలువైన క్షేత్రాలు తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

ఆ జాబితాలో 'రత్నగిరి' క్షేత్రం విశిష్టమైనదిగా వెలుగొందుతోంది. తమిళనాడు ప్రాంతవాసులు కుమారస్వామిని ఎంతటి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ... ఎంతటి అంకిత భావంతో ఆరాధిస్తారో తెలియడానికి ఈ ఆలయం ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పొచ్చు. అంతటి వైశాల్యాన్ని ... వైభవాన్ని కలిగినదిగా ఈ క్షేత్రం కనిపిస్తూ ఉంటుంది. సువిశాలమైన ప్రదేశంలో అద్భుతమైన నగిషీలతో మలచబడిన ఈ కొండపైన గల ఆలయం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.

గర్భాలయంలో స్వామివారు శ్రీవల్లీ - దేవసేనల సమేతుడై దర్శనమిస్తూ ఉంటాడు. ప్రతిరోజు సాయంత్రం వేళలో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ ఉండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. గర్భాలయానికి ఎదురుగా స్వామివారి ఆదేశానికి సిద్ధంగా ఉన్నట్టుగా నెమలి వాహనం కనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడి స్వామిని పూజించడం వలన సమస్త కోరికలు నెరవేరతాయనీ ... సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. విశేషమైన పర్వదినాల్లో ఘనంగా ఇక్కడ జరిగే ఉత్సవాలలో ... ఊరేగింపులలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులవుతుంటారు.

More Bhakti Articles