ఆలయ శిఖరంపై కలశం ఎందుకుంటుంది ?

ఆలయ శిఖరంపై కలశం ఎందుకుంటుంది ?
మారుమూల గ్రామాల నుంచి మహా పుణ్యక్షేత్రాల వరకూ ఏ ఆలయానికి వెళ్లినా గర్భాలయ విమానంపై కలశం కనిపిస్తూ ఉంటుంది. ఈ కలశం గర్భాలయం మధ్య భాగాన్ని సూచించేలా విమానం పై భాగంలో అమర్చడం జరుగుతుంది. ఎండలో సూర్య కిరణాలను అలంకరించుకున్నట్టుగా ఈ కలశం ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ కలశంపై చాలామంది దృష్టి నిలపరు. సాధ్యమైనంత తొందరగా ప్రదక్షిణలు పూర్తిచేసి ఆ జనంలో నుంచి ఎప్పుడు బయటపడదామా అని ఆలోచిస్తూ ఉంటారు.

కొంతమంది మాత్రమే గర్భాలయం పై గల విమానం ... దాని పైన గల కలశం గురించిన ఆలోచన చేస్తారు. అక్కడ కలశాన్ని ఏర్పాటు చేయడంలోని ఉద్దేశం పట్ల సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. కలశం యొక్క ముఖ భాగంలో శ్రీమహావిష్ణువు ... కంఠభాగంలో శివుడు ... మూలంలో బ్రహ్మదేవుడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాకుండా సమస్త విశ్వంలోని సకల శక్తులు కలశంలో నిక్షిప్తమై ఉంటాయని స్పష్టం చేస్తున్నాయి.

ఒక్క కలశానికి నమస్కరించడం వలన త్రిమూర్తులకు నమస్కరించిన ఫలితం దక్కుతుంది. సమస్త శక్తులను దర్శించిన పుణ్యం కలుగుతుంది. సాధారణంగా ఆలయ నిర్మాణం ప్రకారం ప్రధాన దైవం యొక్క పాదాల స్థానంలో రాజగోపురం ... నాభి స్థానంలో ధ్వజ స్తంభం ... హృదయ స్థానంలో ముఖమంటపం ... తల స్థానంలో గర్భాలయం ఉంటాయి. ఈ ముఖ స్థానం పై భాగంలోనే కలశం ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఇక ఆకాశంలోని అనంతమైన దైవ శక్తులు కిరణాల రూపంలో ఈ కలశం ద్వారా గర్భాలయంలో మూలమూర్తి కింద నిక్షిప్తం చేయబడిన యంత్రానికి చేరుతుంటాయి. ఫలితంగా మూలమూర్తి శక్తి పెరుగుతూ ఉంటుంది. వయసు పై బడిన కారణంగా ఆలయానికి చేరుకోలేని వాళ్లు ... అనారోగ్యంతో ఆలయంలోకి ప్రవేశించలేని వాళ్లు ఈ కలశాన్ని దర్శించుకోవడం వలన మూలమూర్తిని చూసిన భాగ్యం దక్కుతుందని చెప్పబడుతోంది. గర్భాలయ విమానం పై కలశాన్ని ఏర్పాటు చేయడంలోని అసలైన ఆంతర్యం ఇదేనని అర్థమౌతోంది.

More Bhakti Articles