నారాయణుడుగా దర్శనమిచ్చే నరసింహుడు

నారాయణుడుగా దర్శనమిచ్చే నరసింహుడు
సాధారణంగా నరసింహస్వామి క్షేత్రం అనగానే గర్భాలయంలో స్వామివారు సింహం తలతో ... మానవ శరీరంతో తన ఎడమ తొడపై అమ్మవారిని కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తుంటాడు. అందుకు భిన్నంగా ప్రశాంతమైన వదనంతో నుంచుని శంఖు చక్రాలతో నారాయాణ స్వరూపంతో స్వామివారు దర్శనమిచ్చే క్షేత్రం మనకి విశాఖ జిల్లా 'భీమిలి' లో కనిపిస్తుంది.

హిరణ్య కశిపుడిని వధించిన అనంతరం, ప్రహ్లాదుడి ప్రార్ధనమేరకు నరసింహస్వామి ప్రశాంతతను పొంది ఇక్కడి కొండపై ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. రౌద్ర రూపాన్ని విడిచి సౌమ్యుడుగా స్వామి కనిపిస్తాడు కనుకనే, ఈ కొండకు 'సౌమ్యగిరి' అనే పేరు వచ్చింది. స్వామివారి గర్భాలయం పక్కనే గల ప్రత్యేక మందిరంలో 'లక్ష్మీదేవి' కొలువై సిరిసంపదలను అనుగ్రహిస్తూ ఉంటుంది.

ఇక కృతయుగం నాటి ఈ క్షేత్రాన్ని ద్వాపరయుగంలో పాండవులు దర్శించినట్టు స్థలపురాణం చెబుతోంది. 'బకాసురుడు' అనే రాక్షసుడిని వధించిన భీముడు, ఆ పాపపరిహారంగా ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి 'భీమిలి' అనే పేరు వచ్చింది ... ఇక్కడి శివుడు భీమేశ్వరుడు పేరుతో కొలవబడుతున్నాడు. ద్వాపరయుగం నాటి నుంచి ఈ క్షేత్రం హరిహరులకు ఆవాసమై అలరారుతోంది.

ఎంతోమంది రాజులు ... సంస్థానాధీశులు ఇక్కడి శివకేశవుల పట్ల అపరిమితమైన భక్తిశ్రద్ధలు ప్రదర్శించారు. ఇక్కడి దైవాలను దర్శించడం వలన దారిద్ర్యం ... దుఃఖం నశిస్తాయనే విశ్వాసం పూర్వకాలం నుంచీ వుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశిష్టమైనదిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి భక్తులు వస్తుంటారు. అంకిత భావంతో హరిహరులను దర్శిస్తూ ... పూజిస్తూ పునీతులవుతుంటారు.

More Bhakti Articles