రావణుడికి శాపం ... సీతమ్మకి వరం !

రావణుడికి శాపం ... సీతమ్మకి వరం !
సీతమ్మతల్లిని అపహరించిన రావణాసురుడు ఆమెని అశోకవనంలో ఉంచుతాడు. సోదరుడైన విభీషణుడు ... సతీమణి అయిన మండోదరి రావణుడి తీరుపట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తారు. రావణుడి అంతఃపురంలో నిత్య పూజలు అందుకునే అమ్మవారు సైతం ఈ విషయంలో ఆయన ధోరణిని తప్పుబడుతుంది ... పద్ధతి మార్చుకోకపోతే వినాశకాలం తప్పదని హెచ్చరిస్తుంది.

అయితే ఎవరి మాటలను కూడా రావణాసురుడు వినిపించుకోలేదు. అలాగని చెప్పేసి తొందరపడి సీతమ్మను తాకనూ లేదు. రాముడిని మరిచిపోయి తన గురించి ఆలోచించమనీ, మనసు మార్చుకోమని మాత్రమే చెబుతూ వెళ్లిపోయేవాడు. మహా పరాక్రమవంతుడైన రావణుడు సీతమ్మ విషయంలో అంత సున్నితంగా వ్యవహరించడానికి కారణం లేకపోలేదు.

సీతమ్మ మహాపతివ్రత కనుక రావణుడు ఆమె చెంతకు రాలేకపోయాడనే వాస్తవం అందరికీ తెలిసిందే. అయితే సీతమ్మను సమీపించడానికి కూడా రావణుడు భయపడటానికి మరోకారణం కూడా వుంది. ఒకసారి బ్రహ్మదేవుడి కూతురైన 'పుజికస్థల' పట్ల కూడా రావణుడు అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఆమె గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన రావణుడిపట్ల బ్రహ్మ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు.

బలవంతుడిననే గర్వంతో పరస్త్రీలను అవమానపరచడం మహాపాపమంటూ రావణుడిపై విరుచుకుపడతాడు. పరస్త్రీని బలవంతంగా వశపరచుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ క్షణమే అతనికి మరణం సంభవిస్తుందని శపిస్తాడు. సీతమ్మ పట్ల రావణుడు దురుసుగా ప్రవర్తించకపోవడానికి ఇది కూడా ఒక కారణమవుతుంది. రావణుడికి గల ఈ శాపం ... సీతమ్మకు వరంగా మారుతుంది.

More Bhakti Articles