ఆపదలు నివారించే అయ్యప్పస్వామి క్షేత్రం

ఆపదలు నివారించే అయ్యప్పస్వామి క్షేత్రం
భద్రాచలం అనే పేరు వినగానే ప్రతియేటా శ్రీరామనవమి సందర్భంగా అక్కడ అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కల్యాణోత్సవం కనులముందు కదలాడుతుంది. ఇక ఆ పవిత్రమైన ప్రదేశంలో అడుగుపెడితే, రామాయణ కాలంలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. సీతారామలక్ష్మణులు తిరిగి వచ్చేంత వరకూ ఇక్కడే కూర్చుందామని అనిపిస్తుంది.

ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక చింతన కలిగించే ఈ క్షేత్రాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. పరుగులుతీసే ఇక్కడి గోదావరితో సీతారాములకు గల అనుబంధాన్ని గురించి మననం చేసుకుంటారు. ఆ తరువాత తిరుగు ప్రయాణంలో ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి సమీపంలో గల అయ్యప్పస్వామి ఆలయానికి వెళుతుంటారు. అలా ఈ ఆలయం కూడా నిత్యం భక్తుల రాకతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది.

ఇక్కడి అయ్యప్ప ఆలయ నిర్మాణశైలి అచ్చం శబరిమల ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. సమస్త దేవతా శక్తులకు నిదర్శనంగా నిలిచే 18 మెట్లు ... ఆ సోపానాలపైనగల వేదికపై చిన్ముద్ర ధారిగా అయ్యప్పస్వామి దర్శనమిస్తుంటారు. కార్తీకమాసంలో దీక్షాధారులతో ఆలయం మరింత సందడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక అయ్యప్పస్వామితో పాటు ఇదే ప్రాంగణంలో వేంకటేశ్వరస్వామి ఆలయం .. వినాయకుడి మందిరం .. సుబ్రహ్మణ్యస్వామి మందిరం కొలువుదీరి కనిపిస్తుంటాయి.

వేంకటేశ్వరస్వామి ఆలయంలో అడుగుపెట్టిన వాళ్లు నిలువెత్తున కనిపించే ఆ మూర్తి పైనుంచి చూపు మరల్చుకోవడం కష్టమే అవుతుంది. అంతటి సౌందర్యమూర్తిగా స్వామి ఇక్కడ కొలువై ఉంటాడు. స్వామికి చేసే విశేష అలంకరణల కారణంగా ఆయన సౌందర్యం రెట్టింపై సమ్మోహితులను చేస్తుంటుంది. ఇక్కడి అయ్యప్పను దర్శించడం వలన ఆపదలు తొలగిపోతాయనీ, శ్రీనివాసుడిని దర్శించడం వలన సిరిసంపదలు కలుగుతాయని భక్తులు చెబుతుంటారు.

More Bhakti Articles