అమావాస్యను పౌర్ణమిగా మార్చిన అమ్మవారు

అమావాస్యను పౌర్ణమిగా మార్చిన అమ్మవారు
దేవతలకు ... దేవుళ్లకు తమ శక్తియుక్తులను ప్రదర్శించాలనే ఆసక్తి ఎప్పుడూ ఉండదు. కానీ తమ భక్తులను కాపాడటం కోసం, తమని నమ్మిన వాళ్లు చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కోసం వాళ్లు రంగంలోకి దిగుతుంటారు. అప్పుడు జరిగే సంఘటనలే మహిమలుగా ఆవిష్కరించబడి తరువాత తరాలవారికి కథలుగా చేరుతుంటాయి.

అలా భద్రకాళీ దేవి తన భక్తుడి మనవిని కాదనలేక అమావాస్య రోజున పౌర్ణమి చంద్రుడిని చూపించిన సంఘటన నాటి ఓరుగల్లులో జరిగిందని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. ఒకసారి సుదర్శనుడనే పండితుడు అనేక రాజ్యాలను దర్శిస్తూ .. అక్కడి పండితులను ఓడిస్తూ తన విజయయాత్రను కొనసాగిస్తుంటాడు. ఈ ప్రయాణంలో భాగంగానే ఆయన ఓరుగల్లుకు చేరుకుంటాడు. పాండిత్యంలో తనని ఓడించమని అక్కడి పండితులకు సవాలు విసురుతాడు.

ఆస్థానంలో పండితుల మధ్య చర్చ ఆరంభమవుతుంది. ఆ చర్చల్లోని అంశంగా మరునాడు 'అమావాస్య' అనే విషయాన్ని సుదర్శనుడు ప్రస్తావిస్తాడు. అది నిజమే అయినప్పటికీ ఆ సందర్భంలో ఆ విషయాన్ని అంగీకరిస్తే ఓరుగల్లు పండితులు ఓటమి పాలవుతారు. అందువలన వారంతా కలిసి మరుసటి రోజు 'పౌర్ణమి' అని ముక్తకంఠంతో వాదిస్తారు. అయితే ఆ రోజున ఆకాశంలో తనకి నిండు చంద్రుడిని చూపాలనీ, లేదంటే ఓటమిని ఒప్పుకోవాలని సుదర్శనుడు చర్చను ముగిస్తాడు.

ఓరుగల్లు పండితులకు పెద్దగా వ్యవహరిస్తోన్న మల్లికార్జునుడు, ఈ గండం నుంచి తమని గట్టెక్కించవలసిందిగా భద్రకాళి అమ్మవారిని ఆశ్రయిస్తాడు. తమ మాట నిలబెట్టి ఓరుగల్లు పరువు ప్రతిష్ఠలు కాపాడమని ప్రాధేయపడతాడు. అమ్మవారి అనుగ్రహంతో ఆ మరునాడు అంటే అమావాస్య రోజున ఆకాశంలో నిండుచద్రుడు ఉదయించి పండువెన్నెల కురిపిస్తాడు. దాంతో సుదర్శనుడు తన ఓటమిని అంగీకరిస్తూ వెళ్లిపోతాడు. అలా అమ్మవారు చూపిన ఆ మహిమను గురించి ఇప్పటికీ భక్తులు ఆసక్తికరంగా చెప్పుకుంటూ ఉంటారు. అంకితభావంతో ఆ తల్లిని అనునిత్యం సేవిస్తుంటారు.

More Bhakti Articles