సిద్ధయ్యను అనుగ్రహించిన బ్రహ్మంగారు

సిద్ధయ్యను అనుగ్రహించిన బ్రహ్మంగారు
బ్రహ్మంగారు జీవసమాధిని పొందాలని నిర్ణయించుకుంటాడు. తన భార్యాబిడ్డలకు ఆ విషయాన్ని తెలియపరుస్తాడు. తనకి మరణంలేదనీ, తన జీవసమాధి అనంతరం పసుపు కుంకుమలు తీయవద్దని భార్యకి చెబుతాడు. మఠ నిర్వహణ బాధ్యతలను కూతురికి అప్పగిస్తాడు. జీవ సమాధికి అవసరమైన ఏర్పాట్లు చేయమని కొడుకులతో చెబుతాడు.

అయితే తనని కేవలం ఒక గురువుగా మాత్రమే కాకుండా, పంచప్రాణాలుగా చూసుకుంటోన్న సిద్ధయ్య కి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేడని బ్రహ్మంగారు భావిస్తాడు. అందువలన ఆ సమయంలో సిద్ధయ్యను అక్కడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో పూలు తీసుకురమ్మని చెప్పి బనగానపల్లె పంపిస్తాడు. ఆయన తిరిగి వచ్చేలోగా ఇక్కడ చకచకా ఏర్పాట్లు జరిగిపోతాయి.

అత్యంత వ్యయప్రయాసాల కోర్చి పూలతో తిరిగివచ్చిన సిద్ధయ్య, ఆశ్రమ ఆవరణలో సమాధిని చూసి నివ్వెరపోతాడు. విషయం తెలుసుకుని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఆయనకి నచ్చజెప్పడానికి ... సముదాయించడానికి గోవిందమ్మ తన వంతు ప్రయత్నం చేస్తుంది. ఇక నుంచి తాను ఎవరిని పూజించాలంటూ సిద్ధయ్య ఆవేదన చెందుతాడు. తన గురువు లేకుండా తాను జీవించడంలో అర్థంలేదని ఆత్మ త్యాగానికి సిద్ధపడతాడు. సరిగ్గా ఆ సమయంలోనే బ్రహ్మంగారు ఆయన ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. తన శిష్యుడిగా ఆయన అందించిన సేవలు మోక్షాన్ని ప్రసాదిస్తాయని చెబుతాడు.

బ్రహ్మంగారు తన పాదుకలు ... యోగదండం ... అంగుళీయకం సిద్ధయ్యకి ప్రసాదిస్తాడు. అవి ఆయనతో ఉన్నంతవరకూ తాను వెంట ఉన్నట్టేనని ఊరడిస్తాడు. ప్రజలలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందింపజేయమనీ, శాంతిమార్గాలను సూచించమని చెబుతాడు. బ్రహ్మంగారి పాదాలకు ఆనందబాష్పాలతో నమస్కరించిన సిద్ధయ్య, తన గురువు సూచించిన మార్గంలో ప్రయాణించడానికి అక్కడి నుంచే తొలిఅడుగు వేస్తాడు. అలా ప్రపంచ చరిత్రలో అసలైన గురుశిష్యులుగా వీరబ్రహ్మేంద్ర స్వామివారు ... సిద్ధయ్య నిలిచిపోయారు.

More Bhakti Articles