స్వయంభువు సిద్ధేశ్వర క్షేత్రం

స్వయంభువు సిద్ధేశ్వర క్షేత్రం
సాధారణంగా శైవ పుణ్యక్షేత్రాల్లో ఇటు స్వయంభువు శివలింగంకానీ ... ప్రతిష్ఠిత శివలింగం గాని కనిపిస్తుంటాయి. అయితే పవిత్రమైన ఒక ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకోగానే, అక్కడే శివలింగం స్వయంభువుగా ఆవిర్భవించిన సంఘటనలు చాలా అరుదుగానే జరుగుతుంటాయి. అలాంటి అరుదైన ... ఆశ్చర్యకరమైన సంఘటన గుంటూరు జిల్లా 'తేరాల' గ్రామసమీపంలో జరిగినట్టు స్థలపురాణం చెబుతోంది.

పూర్వం క్షత్రియులపై ఇరవైఒక్కమార్లు దండెత్తి సంహరించిన పరశురాముడు, పాపపరిహారంగా 108 శివలింగాలను వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించాలానే సంకల్పంతో బయలుదేరుతాడు. ఈ ప్రదేశానికిగల పవిత్రతను గుర్తించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. అందుకు తగిన శిలను ఆయన వెతికి తీసుకునివచ్చే లోగా అక్కడ శివలింగం ఆవిర్భవించి ఉంటుంది. దాంతో పరమశివుడికి పరశురాముడు కృతజ్ఞతలు తెలియజేసి, తాను తెచ్చిన శివలింగాన్ని స్వయంభువు శివలింగం వెనుక భాగంలో ప్రతిష్ఠిస్తాడు. ఈ కారణంగానే ఇక్కడి గర్భాలయంలో రెండు శివలింగాలు భక్తులకు దర్శనమిస్తుంటాయి.

పరశురాముడు తరువాత ఎంతోమంది సిద్ధులు స్వామివారిని సేవించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకున్నారు. అందువల్లనే ఇక్కడి స్వామికి సిద్ధేశ్వరుడు అనే పేరు వచ్చిందని అంటారు. స్వామివారి గర్భాలయం పక్కనే అమ్మవారు 'భ్రమరాంబికాదేవి' పేరుతో పూజలందుకుంటూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పరశురాముడు తవ్విన కోనేరు కూడా కనిపిస్తూ ఉంటుంది. 'రుద్రగుండం' పేరుతో పిలవబడే ఈ కోనేరు మహిమాన్వితమైనదని చెబుతుంటారు.

ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని కలిగిన ఇక్కడి స్వామివారికి క్రీ.శ.8వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్టు శాసన ఆధారాలు లభిస్తున్నాయి. ఆ తరువాత ఎంతోమంది రాజులు స్వామివారి పట్ల తమ భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. పురాణపరమైన ... చారిత్రకపరమైన వైభవాన్ని కలిగిన ఈ ఆలయం అనేక మహిమలకు ఆలవాలంగా అలరారుతోంది. పర్వదినాల సమయంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా వచ్చి సాంబశివుడి క్షేత్రంలో సందడి చేస్తుంటారు ... సదాశివుడి ఆశీస్సులతో సంతోషంగా తిరిగి వెళుతుంటారు.

More Bhakti Articles