శివకేశవుల గొడవకి కారణమైన ప్రేమ వివాహం

ప్రేమించుకుని పెళ్లిచేసుకోవడం నేరమేమీ కాదనేమాట ఒకవైపున వినిపిస్తూనే ఉంటుంది, మరో వైపున ఈ విషయాన్ని గురించి నానాగొడవలు జరుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఈ తరహా వివాహాల విషయంలో ఇరువైపులా పెద్దలు గొడవలు పడుతుంటారు. సాక్షాత్తు ఇదే సమస్య కారణంగా శివకేశవులు ఒకరిపై ఒకరు యుద్ధానికి దిగారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.

శివ భక్తుడైన బాణాసురుడికి 'ఉష' అనే కూతురు ఉంటుంది. ఆమె శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడిని ప్రేమిస్తుంది. పెళ్లంటూ చేసుకుంటే అతనినే చేసుకుంటానని పట్టుపడుతుంది. వీరి వివాహానికి శ్రీకృష్ణుడు అంగీకరిస్తాడుగానీ, బాణాసురుడు నిరాకరిస్తాడు. ఈ విషయంలో బాణాసురుడిని ఎదురించి నిలవడానికి సైతం శ్రీకృష్ణుడు సిద్ధపడతాడు. దాంతో బాణాసురుడు శివుడిని ప్రసన్నం చేసుకుని, తనకి సాయపడేలా మాట తీసుకుని అప్పుడు అసలు సంగతి చెబుతాడు.

ఇచ్చిన మాట తప్పడం భావ్యం కాదు కాబట్టి, బాసురుడి తరఫున శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి శివుడు సిద్ధపడతాడు. ఇటు శ్రీకృష్ణుడి సేనలకు ... అటు శివుడి గణాలకు మధ్య పోరు మొదలవుతుంది. ఇరువైపులా సైనికులంతా మరణించడంతో శివకేశవులు ప్రత్యక్ష యుద్ధానికి దిగుతారు. అప్పుడు బ్రహ్మదేవుడు జోక్యం చేసుకుని వారిని వారిస్తాడు. కృష్ణుడి మాటల ద్వారా నిజానిజాలు తెలుసుకున్న శివుడు, బాణాసురుడి వైఖరిపట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు.

దాంతో తన కూతురు ఉషను ... అనిరుద్ధుడికిచ్చి వివాహం జరిపించడానికి బాణాసురుడు అంగీకరిస్తాడు. వారి వివాహం జరిగిన వేదికను ఇప్పటికీ కూడా చూడవచ్చు. కేదార్ నాథ్ నుంచి బద్రీనాథ్ కి వెళ్లే మార్గంలో 'ఉకీమఠ్' అనే ప్రదేశం తారసపడుతుంది. ఇక్కడే ఉషా - అనిరుద్ధుల వివాహం జరిగిన వేదిక కనిపిస్తుంది. ఇంతటి పురాణపరమైన నేపథ్యాన్ని కలిగిన ఈ ప్రదేశాన్ని దర్శించే అవకాశం ఎవరికి వచ్చినా, నిజంగా అది ఒక అదృష్టమేనని చెప్పాలి.

More Bhakti Articles