వీరభద్రుడు విహరించిన పట్టసాచలం

వీరభద్రుడు విహరించిన పట్టసాచలం
పంచమహా క్షేత్రాలలో ఒకటైన 'పట్టసాచల క్షేత్రం' పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలం పరిధిలోని 'పట్టసం'(పట్టిసీమ ) గ్రామంలో గోదావరి నది మధ్యలో వెలసింది. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువుదీరిన ఈ దివ్య క్షేత్రానికి, శ్రీ భూ నీలా సమేత భావనారాయణస్వామి క్షేత్ర పాలకుడు. కనకదుర్గ అమ్మవారు ... శ్రీ మహిషాసుర మర్ధిని అమ్మవారు ఇక్కడ గ్రామదేవతలుగా దర్శనమిస్తారు. ఇక అనిస్త్రీ ... పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలందుకుంటూ వుంటారు.

పూర్వం దక్ష ప్రజాపతి తాను చేస్తోన్న యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని ఆహ్వానించకుండా అవమాన పరుస్తాడు. ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి, తిరిగి శివుడి దగ్గరికి వెళ్లలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది. దాంతో ఉగ్రుడైన రుద్రుడు ... వీరభద్రుడిని సృష్టించి , దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు. శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞ వాటికపై వీరభద్రుడు విరుచుకుపడతాడు. తన ఆయుధమైన 'పట్టసం' ( పొడవైన వంకీ కత్తి )తో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు. ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టసమనీ ... పట్టిసీమనీ ... పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు.

ఇక దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక 'దేవకూట పర్వతం' పై ప్రళయతాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకి గుచ్చుకోవడంతో, ఆ గుండం నుంచి 'భద్రకాళి' ఆవిర్భవించింది. దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుడిని నిలువరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అయితే ఆయన ఆ చక్రాన్ని నోట కరుచుకుని నమిలి మింగేశాడు. దాంతో ఈ స్వామిని శ్రీ భావనారాయనుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో, తన వామ నేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పించాడట. ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వీరభద్రుడు తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.

ఇక ఇక్కడ వెలసిన వీరభద్రుడిని వీరేశ్వరుడిగా ఆరాధించి భద్రకాలళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు. అలాగే శ్రీ భూ నీలా సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు. ఈ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వరస్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు. శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతిగుర్తులు కనిపిస్తుంటాయని అంటారు. శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతంపైనే తపస్సు చేశాడనీ ... పరశు రాముడు కూడా వీరేశ్వరుడిని దర్శించుకునే మోక్షాన్ని పొందాడని తెలుస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదించాలనుకునేవారు ఒక్కసారైనా పట్టసాచల క్షేత్రాన్ని దర్శిస్తేచాలు ... జన్మ ధన్యమైపోతుంది.

More Bhakti Articles