అడగకనే వరాలిచ్చే ఆదిదేవుడి క్షేత్రం

అడగకనే వరాలిచ్చే ఆదిదేవుడి క్షేత్రం
మంచుకొండల మధ్య నివసించే మహాశివుడు ... భక్తులు కోరాలేగానీ మంచుకొండల మాదిరిగానే కరిగిపోతూ వరాలను కురిపిస్తుంటాడు. అనంతమైన ఈ విశ్వంలో ఎవరు ఏమూల నుంచి తనని స్మరించినా క్షణాల్లో అక్కడికి చేరుకొని కరుణతో కటాక్షించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటాడు. చరిత్రను పరిశీలించినా ... పురాణాలను అధ్యయనం చేసినా అడిగిన వారికి కాదనకుండా వరాలను ప్రసాదించే ఆదిదేవుడిగా ఆయన కనిపిస్తాడు.

అయితే ఎలాంటి కోరికలు లేకుండా నిస్వార్ధంతో తనని సేవించినవారికి అడగకుండానే వరాలను ప్రాసాదించిన సందర్భాలు కూడా అంతకన్నా ఎక్కువగానే ఉన్నాయి. అలా అడగకుండానే ఆయన వరాన్ని ప్రసాదించిన క్షేత్రంగా మనకి తూర్పుగోదావరి జిల్లాలోని 'భట్లపాలిక' కనిపిస్తుంది. ద్రాక్షారామానికి సమీపంలో గల ఈ క్షేత్రంలో 'లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామి' గా పార్వతీపరమేశ్వరులు దర్శనమిస్తుంటారు.

ఆది దంపతులు ఈ పేర్లతో ఇక్కడ కొలువై ఉండనికి కారణం లేకపోలేదు. లోపాముద్రతో కలిసి దక్షిణ పథంలో అడుగుపెట్టిన అగస్తేశ్వరుడు, అనేక ప్రాంతాలను దర్శిస్తూ అక్కడ శివలింగాలను ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. అలా ఆ దంపతులు ఈ ప్రదేశానికి చేరుకున్నప్పుడు, పార్వతీ పరమేశ్వరులే వారికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చారట. వారి పేరుతో తాము ఆ ప్రదేశంలో ఆవిర్భవించి పూజలందుకుంటామనీ, ఆచంద్ర తారార్కం వారి పేరుతో ఈ క్షేత్రం విలసిల్లుతుందని వరాన్ని ప్రసాదించారు.

ఆనాటి నుంచి ఈ క్షేత్రంలో ఆదిదంపతులు నిత్యపూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయం ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతుంటుంది. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పార్వతీ పరమేశ్వరులను దర్శిస్తూ ... పరవశిస్తూ ఉంటారు.

More Bhakti Articles