జతగా ఉన్న అరటిపండ్లు నైవేద్యం పెట్టొచ్చా ?

జతగా ఉన్న అరటిపండ్లు నైవేద్యం పెట్టొచ్చా ?

జతగా ఉన్న అరటిపండ్లు నైవేద్యం పెట్టొచ్చా ?
భగవంతుడికి జరిపే షోడశ ఉపచారాలలో నైవేద్యం ఒకటి. దేవుడి అనుగ్రహాన్ని సంపాదించి పెట్టడంలో నైవేద్యం ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఏయే దైవాలకి ఏ పదార్థాలు ఇష్టమో తెలుసుకుని ఆ నైవేద్యాలను సమర్పించడం వలన వాళ్లకి సంతోషం కలుగుతుందని చెప్పబడుతోంది.

ఇక దేవాలయానికి వెళ్లే వాళ్లు నైవేద్యంగా పండ్లు తీసుకు వెళుతుంటారు. దానిమ్మ ... ద్రాక్ష ... యాపిల్ పండ్లు వంటివి చాలా రకాలు ఉన్నప్పటికీ చాలామంది మొదటి ప్రాధాన్యత అరటిపండ్లకే ఇస్తుంటారు. అయితే ఒక్కోసారి ఒకటిగా అంటుకుపోయిన రెండు అరటిపండ్లు వస్తుంటాయి. జతగా కలిసిపోయిన ఈ పండును దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదని కొందరు అంటుంటారు.

మరికొందరేమో ఇలా అంటుకుపోయిన ఫలాన్ని ప్రసాదంగా ఇచ్చినా, వివాహితులే తప్ప మిగతావాళ్లు తినకూడదని చెబుతుంటారు. ఇలాంటి పండ్లను వివాహితులు తింటే కవలపిల్లలు పుడతారనే నమ్మకం కూడా ప్రచారంలో ఉంది. ఇలా జతగా కలిసి కనిపించే ఈ అరటిపండ్లు భక్తులకు అనేక రకాల సందేహాలను కలిగిస్తూ ఉంటాయి. నిజానికి ఇది ఒక మూఢనమ్మకం వంటిదనే చెప్పాలి. ప్రకృతి పరమైన కొన్ని కారణాల వలన ఒక్కోసారి పండ్లు అలా అంటుకుపోయి పెరుగుతుండటం జరుగుతుంటుంది.

అలాంటి పండ్లు తాజాగా .. ఆరోగ్యకరంగా ఉండాలేగానీ, వాటిని తినడం వలన గానీ .. నైవేద్యంగా సమర్పించడం వలన గాని ఎలాంటి దోషం ఉండదు. ఇక ఇలాంటివాటి గురించి కొంతమంది అదేపనిగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారు వెంటనే వేరే అరటిపండ్లను నైవేద్యంగా సమర్పించాలి. దానివలన సంతోషం .. సంతృప్తి రెండూ కలుగుతాయి. భగవంతుడు భక్తులు తీసుకువచ్చే పండ్లని స్వీకరిస్తాడా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే, ఆయనకి నైవేద్యం అందించడం కోసం భక్తులుపడే ఆరాటాన్ని మాత్రం గమనిస్తూనే ఉంటాడనే విషయాన్ని గ్రహించాలి.

More Bhakti Articles