తిరుమలేషుడు చూపిన మహిమ

తిరుమలేషుడు చూపిన మహిమ
కుటుంబపరమైన బంధాలకు ... అనుబంధాలకు అన్నమయ్య దూరమవుతాడు. ఆ వేంకటేశ్వరుడి సేవకి తాను పూర్తి సమయాన్ని కేటాయించవలసి ఉన్నందునే అలా జరిగిందని ఆయన భావిస్తాడు. హరినామ సంకీర్తనంలోని మాధుర్యాన్ని సామాన్యుల నుంచి అందరికీ తెలియజెప్పాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నదే తడవుగా వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించడం మొదలుపెడతాడు.

ఆయా ప్రాంతాలలోని దైవాలపై కీర్తనలు రచిస్తూ ... గానం చేస్తూ అక్కడి ప్రజానీకానికి ఆధ్యాత్మికపరమైన అనుభూతిని కలిగిస్తూ ముందుకు సాగుతుంటాడు. ఈ నేపథ్యంలోనే కులమతాల పేరుతో కొన్ని వర్గాలను భగవంతుడి సేవకు దూరంగా ఉంచడాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. భగవంతుడు కొందరివాడుకాదనీ అందరివాడని చెబుతాడు. ఆయన దృష్టిలో అందరూ ఒకటేననీ ... ఆ కరుణామయుడి మనసు గెలుచుకోవడానికి ఎలాంటి గొప్పతనాలు అవసరంలేదని చెబుతాడు.

అందుకు అంగీకరిస్తే తమ పెద్దరికాలు ... పెత్తనాలు చేజారిపోతాయని భావించిన కొందరు, అన్నమయ్య కీర్తనలను తగులబెట్టి ఆయనపై గల ద్వేషాన్ని చల్లార్చుకోవాలని అనుకుంటారు. ఆయనలేని సమయం చూసి ఆ తాళపత్రాలకు నిప్పుపెడతారు. చాలావరకూ అవి తగలబడిపోయిన తరువాత అన్నమయ్య అక్కడికి వస్తాడు. తన ప్రభువును కీర్తిస్తూ రాసిన కీర్తనలు లేనప్పుడు తాను బతికుండటం వలన ప్రయోజనం లేదని ఆత్మత్యాగానికి పాల్పడతాడు.

దాంతో ఆ తిరుమలేశుడి మనసు మైనంలా కరిగిపోతుంది. కాలిపోయిన తాళపత్రాలన్నీ కూడా ఎప్పటిలా ఆయన ముందు ప్రత్యక్షమవుతాయి. కళ్లు ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా ఆ తాళ పత్రాలను ప్రేమగా ఆయన తన గుండెలకు హత్తుకుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లంతా అన్నమయ్యను దైవాంశ సంభూతుడిగా భావిస్తూ ఆయన పాదాలకు నమస్కరిస్తారు.

More Bhakti Articles