శ్రీరాముడి గుడిలో సుగ్రీవుడు కనిపించే వైనం !

 శ్రీరాముడి గుడిలో సుగ్రీవుడు కనిపించే వైనం !
రామాయణాన్ని ఏ తరం వారు చదివినా అది ఈమధ్యకాలంలోనే జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సీతమ్మవారు కష్టాలు ... ఆమె కోసం శ్రీరాముడు పడిన ఆరాటం ... కళ్ల ముంగిట కదలాడుతున్నట్టుగా అనిపించి ''అయ్యో'' అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రామచంద్రమూర్తికి సహాయంగా నిలిచిన హనుమంతుడు ... సుగ్రీవుడిని కలిసి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపిస్తుంది.

ఆపద సమయంలో సాయంచేసిన వాళ్లు ఎంతగా గుర్తుండి పోతారనడానికి నిదర్శనంగా హనుమంతుడు ... సుగ్రీవుడు కనిపిస్తుంటారు. అయితే శ్రీరాముడి నుంచి ప్రతిఫలాన్ని ఆశించి ఆయనకి సుగ్రీవుడు సాయం చేశాడు. కానీ హనుమంతుడు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా, రాముడి నుంచి దుఃఖాన్ని దూరం చేయడమే ధ్యేయంగా సాయపడ్డాడు. ఈ కారణంగానే ప్రతి రామాలయంలోను సీతారామలక్ష్మణులతో పాటు హనుమంతుడు పూజలు అందుకుంటూ ఉంటాడు.

అయితే అందుకు భిన్నంగా 'హంపి' లో గల కోదండరామాలయం'లో హనుమంతుడి స్థానంలో సుగ్రీవుడు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఆలయాన్ని దర్శించిన వారు హనుమంతుడనుకుని నమస్కరించి, ఆయన సుగ్రీవుడని తెలియగానే ఆశ్చర్యపోతుంటారు. హనుమంతుడి స్థానంలో సుగ్రీవుడు ఎలా ఉన్నాడంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు.

వాలిని శ్రీరాముడు ఈ ప్రదేశంలోనే సంహరించి, ఆయన సోదరుడైన సుగ్రీవుడికి రాజుగా పట్టాభిషేకం చేసింది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఇందుకు గుర్తుగా ఈ ప్రదేశంలో ఈ ఆలయం నిర్మించడం వల్లనే శ్రీరాముడి పాదాలచెంత సుగ్రీవుడుని ప్రతిష్ఠించడం జరిగిందని చెప్పబడుతోంది. భారీ ఆకారంగల ఈ మూలమూర్తులు కళ్లను కట్టిపడేస్తాయి ... మనసును మంత్రించి వేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles