రుక్మిణీదేవి పూజించిన అమ్మవారి క్షేత్రం

రుక్మిణీదేవి పూజించిన అమ్మవారి క్షేత్రం
జగజ్జనని అయిన అమ్మవారు యుగయుగాలుగా తన భక్తులను అనుగ్రహిస్తూనే ఉంది ... వారిచే ఘనంగా నిత్యనీరాజనాలు అందుకుంటూనే ఉంది. అమ్మవారు ఆవిర్భవించిన క్షేత్రాల్లో అడుగు పెట్టినంత మాత్రానే దారిద్ర్యం ... దుఃఖం తొలగిపోతాయని చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఆ తల్లి దర్శనం కోసం అనేక మంది భక్తులు ఆమె క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు, అత్యంత భక్తి శ్రద్ధలతో కోరికలు విన్నవించుకుని కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు.

అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'అమీనాబాద్' కనిపిస్తుంది. పరమపవిత్రమైన ఈ క్షేత్రంలో అమ్మవారు 'మూలాంకురేశ్వరి' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటోంది. గుంటూరు సమీపంలో గల ఈ క్షేత్రం ద్వాపరయుగంనాటిదిగా స్థలపురాణం చెబుతోంది. రుక్మిణీదేవి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారిని ఆరాధించేదట. ఆమె కుటుంబసభ్యులు ఈ తల్లిని తమ ఇలవేల్పుగా పూజిస్తూ ఉండేవారు.

రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిపై మనసు పారేసుకుంటుంది. ఆయననే భర్తగా పొందాలని నిర్ణయించుకుంటుంది. అయితే రుక్మిణీ దేవి తండ్రి ఆమె వివాహం శిశుపాలుడితో జరిపించడానికి రంగం సిద్ధం చేస్తాడు. పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేయబడిన రుక్మిణీదేవి, ఆచారం ప్రకారం మూలాంకురేశ్వరి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళుతుంది. రుక్మిణీ సందేశాన్ని ముందుగానే అందుకున్న శ్రీకృష్ణుడు, అదే సమయంలో వచ్చి ఆమెని తన రథంలో తీసుకువెళతాడు.

ఇంతటి అద్భుతమైన సంఘటన ఈ క్షేత్రంలో జరిగిందని తెలిసినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. అలా రుక్మిణీదేవి పూజలందుకున్న అమ్మవారు ఇక్కడి కొండపై కొలువుదీరి కనిపిస్తుంది. ఎంతోమంది రాజులు అమ్మవారిని తమ ఇలవేల్పుగా భావించి పూజించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆలయ సముదాయంలో భాగంగా ఉన్న యజ్ఞమంటపం ... కళ్యాణ మంటపం నాటి ప్రాచీనతకు ప్రతీకగా కనిపిస్తుంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, మాటల్లో చెప్పలేని మానసిక ప్రశాంతత లభిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles