యముడితో నందీశ్వరుడు తలపడిన క్షేత్రం

యముడితో నందీశ్వరుడు తలపడిన క్షేత్రం
మార్కండేయుడి ఆయువును తీసుకువెళ్లడానికి యమధర్మరాజు వచ్చినప్పుడు ఆయన్ని శివుడు ఎదిరించిన సంఘటన, నిజమైన భక్తుల విషయంలో శివుడు దేనికీ వెనుకాడడనే సంగతిని నిరూపిస్తూ ఉంటుంది. అలాగే తన ఆరాధ్యదైవమైన శివుడు ఆదేశాన్ని ఆచరణలో పెట్టడం కోసం నందీశ్వరుడు కూడా యమధర్మరాజుతో తలపడిన సందర్భం కనిపిస్తుంది. ఈ సంఘటన జరిగిన ప్రదేశంగా కుంభకోణం సమీపంలోని 'తిరువిశనల్లూర్ ' కనిపిస్తుంది.

అత్యంత విశిష్టమైనదిగా విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పరమశివుడు ... శివయోగినాథస్వామిగా, అమ్మవారు సౌందరనాయకిగా పూజలు అందుకుంటూ ఉంటారు. నందీశ్వరుడి ఆత్మాభిమానం దెబ్బతినేలా యమధర్మరాజు వ్యవహరిస్తాడు. ఆగ్రహావేశాలకి లోనైన నందీశ్వరుడు .. యమధర్మరాజును తరిమికొట్టింది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగా ఇక్కడి స్వామిని దర్శించడం వలన యమగండాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఇక ఈ క్షేత్రంలో శివుడి అష్టవిధ రూపాలకు ప్రతీకలుగా అష్ట తీర్థాలు కనిపిస్తుంటాయి. నందితీర్థం .. శూలతీర్థం .. జటాతీర్థం .. గంగాతీర్థం .. సరస్వతీ తీర్థం .. బ్రహ్మకుండతీర్థం .. చక్రతీర్థం .. లక్ష్మీతీర్థంగా పిలవబడే ఈ అష్ట తీర్థాలు ఈ క్షేత్ర విశిష్టతను చాటిచెబుతుంటాయి. ఈ అష్ట తీర్థాలలోని నీటిని తలపై చల్లుకున్నంత మాత్రానే సమస్తపాపాలు పటాపంచలు అవుతాయని అంటారు. అంతే కాకుండా ఈ అష్టతీర్థాలు వ్యాధులను .. బాధలను దూరం చేస్తాయనీ, భగవంతుడి అనుగ్రహానికి దగ్గర చేస్తాయని అంటారు.

More Bhakti Articles