పాండురంగడి ఆదేశంతో నిర్మించబడిన క్షేత్రం

పాండురంగడి ఆదేశంతో నిర్మించబడిన క్షేత్రం
జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు మనిషిని ఆధ్యాత్మికత వైపు నడిపిస్తాయి. తన వాళ్లని అనుకున్న వాళ్లంతా తనని మోసం చేసినప్పుడు ... ఆపదకాలంలో తనని ఒంటరిగా వదిలేసినప్పుడు సహజంగానే మనిషి మనసు భగవంతుడి వైపు మళ్లుతుంది. అంతవరకూ ఆయనను పట్టించుకోనందుకు పశ్చాత్తాపపడుతూ ఆ స్వామి సన్నిధిలోనే ఉండిపోవాలని అనిపిస్తుంది.

ఇక మరికొందరి విషయంలో బాల్యం నుంచే ఆధ్యాత్మిక వైపు ఆసక్తి కనబరచడం జరుగుతుంటుంది. వీళ్లు భగవంతుడి తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి అనేక క్షేత్రాలను దర్శిస్తుంటారు. అలా వివిధ క్షేత్రాలను దర్శిస్తూ పండరీపురం వెళ్లిన ఓ భక్తుడికి స్వామి సాక్షాత్కారం లభించింది. ఫలితంగా చీరాలలో విఠలాలయం నిర్మించబడింది.

పూర్వం ఈ ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే భక్తుడు, తన అంగవైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా అనేక క్షేత్రాలను దర్శించాడు. పాండురంగస్వామిని కీర్తిస్తూ పండరీపురం చేరుకున్నాడు. అక్కడే స్వామి ఆయనకి దర్శనమిచ్చి, తనని సేవిస్తూ శేష జీవితాన్ని కొనసాగించమని చెప్పి మోక్షాన్ని అనుగ్రహిస్తూ అదృశ్యమయ్యాడట. అక్కడి నుంచి ఈ ప్రదేశానికి చేరుకున్న వెంకటసుబ్బయ్య, దాతల సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించి, రుక్మిణీ సమేత పాండురంగస్వామిని ప్రతిష్ఠ చేశాడు.

భగవంతుడి ఆదేశం మేరకు నిర్మించబడిన ఆలయం కావడం వలన అనతికాలంలోనే తన ప్రత్యేకతను చాటుకుంటూ ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి తమ మనసులోని కోరికలు చెప్పుకుంటూ ... ధర్మబద్ధమైన ఆ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అలా 19 వ శతాబ్దం ప్రధమార్థంలో ఇక్కడ కొలువైన స్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై, వారిచేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు.

More Bhakti Articles