మహేంద్రుడిని ఎదుర్కున్న మహర్షి ఇల్లాలు

మహేంద్రుడిని ఎదుర్కున్న మహర్షి ఇల్లాలు
చ్యవన మహర్షి కోల్పోయిన యవ్వనం ... అశ్వనీ దేవతల వలన ఆయనకి లభిస్తుంది. దాంతో దేవేంద్రుడి వలన అవమానించబడిన అశ్వనీ దేవతలకి గౌరవం దక్కేలా చేయాలని చ్యవన మహర్షి నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన మామగారైన శల్యాతి మహారాజుతో పుత్రకామేష్టి వ్రతాన్ని జరిపించాలని అనుకుంటాడు. ఆయన సతీమణి అయిన సుకన్య కూడా అందుకు తన సమ్మతిని తెలుపుతుంది.

పుత్రకామేష్టి యాగంలో హవిర్భాగం అశ్వనీదేవతలకి ఇవ్వబడుతుందని తెలిసిన దేవేంద్రుడు ఆగ్రహావేశాలకి లోనవుతాడు. తాను తరిమివేసిన అశ్వనీ దేవతలను చ్యవన మహర్షి చేరదీయడం, తనకి కాకుండా వారికి హవిర్భాగాన్ని ప్రకటించడాన్ని ఆయన సహించలేకపోతాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆ యాగం జరగకుండా చేయాలని నిర్ణయించుకుంటాడు.

చ్యవన మహర్షి తపోబల సంపన్నుడనీ, ఆయన సతీమణి సుకన్య మహాపతివ్రత అని ఆయనతో చెబుతాడు నారదుడు. ఆ దంపతులను అవమానపరచాలనుకోవడం మంచిదికాదని అంటాడు. అయినా దేవేంద్రుడు ఆ మాటలను పెద్దగా పట్టించుకోడు. అగ్ని దేవుడిని పిలిచి .. చ్యవన మహర్షి చేస్తోన్న యాగానికి వెళ్లవద్దనీ ... అగ్ని రాజుకోక వాళ్లు యాగాన్ని విరమించుకునేలా చేయమని చెబుతాడు. దాంతో అగ్ని దేవుడు ఆయన మాటలను తూ. చ. తప్పకుండా పాటిస్తాడు.

హోమగుండంలో అగ్ని ఎంతకీ రాజుకోకపోవడంతో చ్యవన మహర్షి దంపతులు ... శల్యాతి రాజు దంపతులు ఆశ్చర్యపోతారు. ఇది దేవేంద్రుడి పన్నాగమేననే విషయాన్ని సుకన్య గ్రహిస్తుంది. తాను తన భర్త పట్ల అచంచెలమైన ప్రేమానురాగాలను కలిగి ఉంటే, తాను ఆయనని దైవంగా భావించి సేవిస్తూ ఉండటం నిజమే అయితే హోమగుండంలో అగ్ని రాజుకోవాలని అంటుంది సుకన్య. అంతే ఆ క్షణమే హోమగుండంలో అగ్ని రాజుకుని యాగం ప్రారంభమవుతుంది. చ్యవన మహర్షిని అవమానించాలనుకున్న దేవేంద్రుడు తానే అవమానించబడతాడు. అలా దేవేంద్రుడి పాచిక పారకుండా చేసిన సుకన్య, తన పాతివ్రత్య మహిమను మరోసారి లోకానికి చాటుతుంది.

More Bhakti Articles