లఘు ఆరాధన అంటే ఏమిటి ?

లఘు ఆరాధన అంటే ఏమిటి ?
కాలం ఎన్ని విషయాల్లో ఎంతగా మారిపోతున్నా శాస్త్రాన్ని విడిచి ... దైవారాధనను మరిచి వ్యవహరించకపోవడమే భారతీయుల గొప్పతనం. ప్రాచీన కాలంలోనే కాదు, దైవారాధన చేయకుండా మంచినీళ్లు కూడా ముట్టనివాళ్లు ఈ రోజుల్లోనూ ఉన్నారు. భగవంతుడు మంచివాడు ... మంచివాళ్లకు ఆయన ఎప్పుడూ మంచే చేస్తుంటాడని విశ్వసిస్తుంటారు. అనునిత్యం ఆయనని పూజిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు. ఇక ముందు తాము సాధించవలసిన విజయాలకు సహకారాన్ని అందించమని వేడుకుంటూ ఉంటారు.

అయితే ఒక్కోసారి అనారోగ్యంపాలు కావడం ... అత్యవసర పరిస్థితుల్లో ఉండటం వలన ఎక్కువ సేపు పూజకి సమయాన్ని కేటాయించలేక పోవడం జరుగుతుంటుంది. అప్పుడు వారు దైవానికి షోడశోపచార పూజ చేయలేక పోయినందుకు బాధపడుతుంటారు. చకచకా దీపారాధన చేసి నైవేద్యం పెట్టడం వలన దోషం కలుగుతుందేమోనని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికోసమే శాస్త్రం 'లఘు ఆరాధన' చెబుతోంది.

దైవానికి పుష్పం .. ధూపం .. దీపం .. నైవేద్యం .. హారతి సమర్పిస్తే సరిపోతుంది. ఈ 'పంచోపచారాలు' నిర్వహించడం వలన షోడశోపచారాలు జరిపిన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇక పూజా మందిరంలో విష్ణుమూర్తి .. శివుడు .. పార్వతి .. వినాయకుడు .. సూర్యుడు చిత్రపటాలు ఉంటే, దీపారాధన చేసి ఇష్ట దేవత మంత్రం చెప్పుకుంటే సరిపోతుందని స్పష్టం చేస్తున్నాయి.

More Bhakti Articles