నాగదోష నివారణకి దర్శించవలసిన క్షేత్రం

నాగదోష నివారణకి దర్శించవలసిన క్షేత్రం
తెలిసీ తెలియక చేసే పనులవలన ... జాతక ప్రభావంవలన కొన్ని దోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఫలితంగా జీవితంలో అడుగడుగునా ఆటంకాలు ... అనుకోని ఇబ్బందులు ఎదురవుతూఉంటాయి. ఇలాంటి వాటిలో నాగదోషం ప్రధానంగా చెప్పబడుతూ ఉంటుంది. నాగదోషం నుంచి బయటపడటం కొంచెం కష్టమేనని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ మహిమాన్వితమైన దైవం ఆవిర్భవించిన విశిష్టమైన క్షేత్రాన్ని ఆశ్రయిస్తే ఆ దోషం తొలగిపోవడం పెద్ద కష్టమేమి కాదు.

అలాంటి క్షేత్రం అనంతపురం సమీపంలో గల 'పంపనూరు' లో దర్శనమిస్తుంది. కొన్ని క్షేత్రాల్లో శక్తి ఆయుధాన్ని ధరించి దళపతిగాను ... మరికొన్ని క్షేత్రాల్లో లింగాకారంలోను దర్శనమిచ్చే కుమారస్వామి, ఈ క్షేత్రంలో సర్పరూపంలో కొలువై ఉండటం విశేషంగా చెబుతారు. గర్భాలయంలో స్వామివారు పడగవిప్పిన పంచతలల నాగుపాములా కనిపిస్తూ ఉంటాడు. నల్లరాయితో మలచబడిన ఈ మూర్తిని చూడగానే ఇక్కడి స్వామి మహిమాన్వితుడనే విషయం అర్థమైపోతుంది.

పూర్వం నుంచి ఈ ప్రాంతంలో నాగుల సంచారం ఎక్కువగా ఉండటం ... స్వామి సర్పరూపంలో కొలువై ఉండటం వలన ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. నాగదోషంతో బాధపడేవారు ఇక్కడి స్వామివారిని పూజించడం వలన వెంటనే ఫలితం కనిపిస్తుందని అంటారు. ఇక మనసులోని కోరికను స్వామివారికి చెప్పుకుని తొమ్మిది ఆదివారాలపాటు ఆలయంలో జపం చేయడం వలన, ధర్మబద్ధమైన ఆ కోరికలు అనతికాలంలోనే నెరవేరతాయని చెబుతారు.

అందుకు నిదర్శనంగా స్వామికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్లు ... మొక్కుబడులు చెల్లించుకోవడానికి వచ్చిన వాళ్లు ఇక్కడ ఎంతోమంది కనిపిస్తుంటారు. విశిష్టమైనటు వంటి పుణ్య తిథుల్లో ఇక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లోనూ ... ఘనంగా జరిగే ఉత్సవాల్లోను భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు. ఆ స్వామి కృపాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.

More Bhakti Articles