అష్టవిధ శివ రూపాలు - అభిషేకాలు

అష్టవిధ శివ రూపాలు  - అభిషేకాలు
ఆదిదేవుడు అభిషేక ప్రియుడు ... అనుక్షణం అభిషేక జలాల్లో తడుస్తూ భక్తులను తన్మయులను చేస్తుంటాడు. నీటితో పాటు పాలు .. పెరుగు .. నెయ్యి .. తేనె వంటి పంచామృతాలతో పరమశివుడిని అభిషేకిస్తే సంతోషంతో ఆయన పొంగిపోతాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక పసుపు నీళ్లతోను ... గంధం నీళ్లతోను ... పండ్ల రసాలతోను శంకరుడిని అభిషేకించడం కూడా తరతరాలుగా వస్తోంది.

ఇక విభూతితో అభిషేకించడం వలన అన్ని రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసిన ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అష్టవిధ అభిషేకాల గురించిన ప్రస్తావన కూడా కనిపిస్తుంది. పరమశివుడి రూపాలలోని ఎనిమిది రూపాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ అష్టమూర్తులకు చేసే అష్టవిధ అభిషేకం వలన కలిగే పుణ్యఫలం మాటల్లో చెప్పలేనిది.

ఒక్కో విధమైన అభిషేకం ఒక్కో ప్రత్యేకమైన ఫలితాన్ని అందిస్తుందని అంటారు. 'పృథ్వీ రూపధారి' అయిన రుద్రుడికి ధారాభిషేకం ... 'జలరూపధారి' అయిన శివుడికి ఆవృత్త్వాభిషేకం నిర్వహించాలి. 'తేజోరూపధారి' అయిన శంకరుడికి రుద్రాభిషేకం ... 'ఆకాశ రూపధారి' అయిన మహేశ్వరుడికి శతరుద్రాభిషేకం చేయాలి. 'వాయురూపధారి' అయిన పరమేశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం ... 'సూర్యరూపధారి' అయిన రుద్రుడికి లఘురుద్రాభిషేకం జరపాలి.

ఇక 'చంద్ర రూపధారి' అయిన మహాశివుడికి మహారుద్రాభిషేకం ... 'సర్వరూపధారి' అయిన జగదీశ్వరుడికి అతిరుద్రాభిషేకం చేయాలని శాస్త్రం చెబుతోంది. అష్ట మూర్తులకు జరిపే అష్టవిధ అభిషేకాల వలన సమస్త పాపాలు నశించి ఆ పుణ్య ఫలాల కారణంగా సిరిసంపదలు కలుగుతాయనీ, ఆశించిన జ్ఞానం ... మోక్షం లభిస్తాయని చెప్పబడుతోంది.

More Bhakti Articles