పాండవులచే పూజలందుకున్న పరమశివుడు

పాండవులచే పూజలందుకున్న పరమశివుడు
పాండవులు తమ అరణ్యవాస కాలంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటూ ముందుకు సాగారు. రాజభోగాలకు దూరమై ... అడవుల్లో నానాఅవస్థలు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తమని ఆ కష్టాల నుంచి గట్టెక్కించమని శ్రీమన్నారాయణుడి అవతారమైన కృష్ణుడినీ ... పరమశివుడిని ప్రార్ధించారు. ఈ నేపథ్యంలోనే వాళ్లు ఇప్పటి కర్నూలు జిల్లా పరిధిలో గల 'ఓంకారం' క్షేత్రాన్ని కూడా దర్శించినట్టు చెబుతారు.

యుగయుగాలుగా పూజలందుకుంటోన్న ఇక్కడి శివుడిని వ్యాసమహర్షి ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ పరమశివుడు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని తెలుసుకున్న 'సప్తరుషులు' ఇక్కడికే వచ్చి ఆయనను సేవించినట్టు చెబుతారు. పర్వత శ్రేణుల పాదభాగంలో ... పచ్చని చెట్ల మధ్య కొలువైన ఈ ఆలయంలో స్వామివారిని 'సిద్ధేశ్వరుడు' గా పిలుస్తుంటారు.

ఎంతోమంది సిద్ధుల ... మునుల ... మహర్షుల కోరికలను నెరవేర్చిన కారణంగా స్వామివారికి ఈ పేరు వచ్చిందని అంటారు. మరెంతో మంది మహారాజులు ... మంత్రులు కూడా ఈ స్వామి అనుగ్రహాన్ని పొందినవారే. ఇక స్వామివారి గర్భాలయానికి ఇరువైపులా పార్వతీదేవి ... గంగాదేవి కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ పక్కనే వినాయకుడు ... వీరభద్రుడు కూడా ప్రత్యేక మందిరాల్లో దర్శనమిస్తూ ఉంటారు.

పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఇక్కడి కోనేరులో స్నానం చేసిన భక్తులు, దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సోమవారంతో పాటు ప్రతి పౌర్ణమి రోజున కూడా ఇక్కడి స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. పురాణపరమైన నేపథ్యం ... చారిత్రక వైభవం కలిగిన ఈ క్షేత్ర దర్శనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మహాదేవుడి కరుణాకటాక్ష వీక్షణాలను అందజేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles