వేంకటేశ్వరుడు కోరి కొలువైన క్షేత్రం

వేంకటేశ్వరుడు కోరి కొలువైన క్షేత్రం
వైకుంఠంలో పాలకడలిలో శేష పాన్పుపై శయనించే శ్రీమహావిష్ణువు, భూలోకవాసుల దారిద్ర్యాన్ని ... దుఃఖాన్ని నివారించాలని నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ... లక్ష్మీదేవి తనపై అలకబూని భూలోకానికి వెళ్లేలా చేస్తాడు. ఆ తరువాత ఆమెను వెదకడానికి అన్నట్టుగా తాను అక్కడికే చేరుకుంటాడు. అలా లక్ష్మీనారాయణులు భూలోకంలో అడుగుపెట్టడం మానవాళి చేసుకున్న అదృష్టం.

తిరుమలను తన నివాసంగా చేసుకున్న శ్రీనివాసుడు, ఆ తరువాత అనేకమంది భక్తుల మనసులో ప్రవేశించి, వివిధ ప్రాంతాలలో తన మూర్తులు ఆవిష్కృతమయ్యేలా చేశాడు. ఫలితంగా అనేక ప్రాంతాలలో వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించబడ్డాయి. అలాంటి విశిష్టత కలిగిన ఆలయం వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలపరిధిలో గల 'లాదెళ్ల' గ్రామంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశం వేంకటేశ్వరస్వామికి ఎంతగానో నచ్చిందనీ, ఆయన కోరి ఇక్కడ కొలువయ్యాడని స్థలపురాణం చెబుతోంది.

ఒకప్పుడు ఈ ప్రాంతం రెడ్డిదొరల ఏలుబడిలో ఉండేది. ఈ గ్రామానికి పక్కనే గల మరో గ్రామంలో వేంకటేశ్వరస్వామి వారిని ప్రతిష్ఠించాలని భావించిన రెడ్డిదొరలు, సాలగ్రామశిలను స్వామివారి ధృవమూర్తిగా మలిపించారు. ఆ విగ్రహాన్ని ఈ గ్రామం మీదుగా తరలిస్తూ ఉండగా, సరిగ్గా ఎడ్లబండి ఈ ప్రదేశానికి వచ్చి ఆగిపోయింది. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎద్దులు ఒక్క అడుగుకూడా ముందుకు కదల్లేదు.

ఆ రాత్రి ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ పడుకున్న దొరకి స్వామివారు కలలో కనిపించారట. ఎడ్లబండి ఆగిన స్థలం అత్యంత పవిత్రమైనదనీ, తాను కొలువై ఉండటానికి అదే తగిన స్థలమనీ ... తనని అక్కడే ప్రతిష్ఠించామని చెప్పాడు. దాంతో మరునాడు ఉదయం నుంచే పనులను ప్రారంభించిన దొర, ఇక్కడే ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. స్వామివారి నిత్య ధూప .. దీప .. నైవేద్యాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లుచేశాడు.

స్వామివారి మూలమూర్తి అత్యంత అరుదైన సాలగ్రామ శిల కావడం, ఆ రూపంలో అణువణువునా సౌందర్యం ఉట్టిపడుతూ ఉండటం గురించి భక్తులు విశేషంగా చెప్పుకుంటారు. ఈ స్వామిని దర్శించడం వలన కోరిన వరాలు లభిస్తాయనీ ... సకల శుభాలు చేకూరతాయని ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles