విద్యార్థినీ విద్యార్థులు దర్శించవలసిన ఆలయం

విద్యార్థినీ విద్యార్థులు దర్శించవలసిన ఆలయం
జీవితంలో ఎవరు ఏ రంగంలో రాణించాలన్నా అందుకు అవసరమైన జ్ఞానం ఉండాలి. ఏ విషయాన్నైనా ఆకళింపు చేసుకుని, అందులో తగిన నైపుణ్యాన్ని సాధించేలా చేసేది జ్ఞానమే. ఒక పరిధి అనేది లేని జ్ఞానాన్ని సముపార్జించడం వలన అది కీర్తి ప్రతిష్ఠలను ... సిరిసంపదలను వెంటతీసుకు వస్తుంది. అలాంటి జ్ఞానం అంగట్లో దొరకదు ... అందుకు సరస్వతీదేవి అనుగ్రహం కావాలి.

ఆ తల్లి అనుగ్రహంతోనే ఎంతోమంది అమాయకులు సైతం సంగీత సాహిత్యాది కళలలో అసమానమైన ప్రతిభను కనబరుస్తూ చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి అమ్మవారికి గల ఆలయాలు సంఖ్యాపరంగా చూసుకుంటే చాలా తక్కువగానే కనిపిస్తాయి. ఈ జాబితాలో సికింద్రాబాద్ - మల్కాజ్ గిరికి చెందిన సరస్వతీదేవి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది.

దశాబ్దకాలం క్రిందట నిర్మించబడిన ఇక్కడి ఆలయంలో అమ్మవారు జ్ఞాన సరస్వతీదేవిగా పూజలు అందుకుంటోంది. కుదురుగా తీర్చిదిద్దబడిన ఇక్కడి ఆలయంలో అమ్మవారిని దర్శించడానికి విద్యార్థినీ విద్యార్థులు ఎక్కువగా వస్తుంటారు. 'శ్రీ పంచమి' వంటి పర్వదినాల్లో ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు ఎక్కువగా జరిగుతుంటాయి. ఇక అమ్మవారి వైభవాన్ని చూడాలంటే దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆలయానికి చేరుకోవాలి.

ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలుగా ముస్తాబు చేసి ఆరాధిస్తారు. ఆ సమయంలో అమ్మవారి అలంకరణ చూసితీరవలసిందే. ఇదే ప్రాంగణంలో గణపతి - కుమారస్వామి కొలువై ఉండటం వలన ఈ ఆలయం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. విద్యార్థి దశలో ఇక్కడి అమ్మవారిని పూజించిన వారు, ఆ తరువాత అత్యున్నతమైన స్థానానికి చేరుకున్నట్టుగా అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles