అమ్మవారే దిగివచ్చిన అపురూప క్షేత్రం

 అమ్మవారే దిగివచ్చిన అపురూప క్షేత్రం
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు ఆయా సందర్భాలను బట్టి వివిధ ప్రాంతాలలో ... వివిధ నామాలతో ఆవిర్భవించింది. దక్షిణభారతంలో వాసవీకన్యకాపరమేశ్వరిగా అవతరించిన అమ్మవారు. రాజస్థాన్ ప్రాంతంలో శాకంబరీదేవిగా పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇక్కడి 'సీకర్' ప్రాంతవాసులు శాకంబరీదేవిని తమ ఇంటి ఆడపడచుగా భావించి ఆరాధిస్తూ ఉంటారు. శాకంబరీదేవికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, తమ కష్టసుఖాలను ఆ తల్లితో పంచుకుంటూ ఉంటారు.

తమ కుటుంబాన్ని ఆమె చల్లగా చూస్తూ ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడి ఆలయం ప్రాచీనకాలానికి చెందినది కావడంతో తరతరాలుగా ఈ నమ్మకం కొనసాగుతూనే ఉంది ... మరింతగా అది బలపడుతూనే ఉంది. అమ్మవారు శాకంబరీదేవిగా ఇక్కడ ఆవిర్భవించడం వెనుక పురాణపరమైన కథ ఒకటి వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం రాక్షసమాయ కారణంగా ఈ ప్రాంతంలో కరవుకాటకాలు ఏర్పడ్డాయట. ప్రజలంతా ఆకలితో అల్లాడిపోతూ ఉండటంతో, అమ్మవారు తన శరీరం నుంచి అనేక శాకములను సృష్టించి వారి ఆకలి తీర్చిందట. ఆ తరువాత ఆ అసురుడిని సంహరించి ఇక్కడ అవతరించిందనీ, శాకంబరీదేవిగా పూజలు అందుకుంటోందని అంటారు. సహజంగానే ఆలయ నిర్మాణం రాజస్థానీ శైలిలో కనిపిస్తుంది. ప్రాకారాలు .. గోపురాలు .. మంటపాలు .. అద్భుతమైన నగిషీలతో అపూర్వమైన శిల్ప సంపదను ఆవిష్కరిస్తూ ఉంటాయి.

గర్భాలయంగా పిలవబడే మందిరంలో రుద్రాణి - బ్రహ్మణి పేర్లతో అమ్మవారి ప్రతిమలు దర్శనమిస్తాయి. సిందూర వర్ణంలో కనిపించే ఈ ప్రతిమలు పరిమాణం రీత్యా చిన్నవిగానే కనిపించినప్పటికీ అత్యంత శక్తిమంతమైనవిగా చెప్పబడుతున్నాయి. సువిశాలమైన ప్రదేశంలో ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయానికి మహిళా భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఆదరించి ఆకలితీర్చే అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ ... కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటారు.

More Bhakti Articles