యమదండన తప్పించే శివ క్షేత్ర దర్శనం

యమదండన తప్పించే శివ క్షేత్ర దర్శనం
భగవంతుడు ఇచ్చిన ఆయువు తీరిపోగానే ఎవరైనా సరే పండుటాకులా రాలిపోవలసిందే. ప్రతి జీవికి భగవంతుడు ప్రసాదించిన ఆయువు లెక్క చూసుకుంటూ, అది తీరగానే ఆ జీవిని తనతో తీసుకువెళ్లడంలో యమధర్మరాజు ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇక శివ భక్తులను తీసుకువెళ్లే విషయంలో మాత్రం ఆయన కాస్త ఆలోచన చేస్తాడు. గతంలో మార్కండేయుడు విషయంలో ఆయనకి ఎదురైన అనుభవమే అందుకు కారణం.

అప్పుడు శివుడి ఆగ్రహానికి గురైన కారణంగా యమధర్మ రాజు వెనక్కి తగ్గాడు. ఆ తరువాత శివ భక్తులకు తన అనుగ్రహం కూడా ఉంటుందని మనవిచేశాడు. అలా యమధర్మరాజు మనసును మార్చేసిన క్షేత్రంగా విశాఖ సమీపంలో గల 'పంచధార్ల' కనిపిస్తుంది. సమస్త జీవుల ఆయువును హరించే శక్తి సంపన్నుడననే అహంభావం కారణంగా ఒకసారి యమధర్మరాజుకి కుష్టువ్యాధి పొడచూపిందట. దాంతో ఆయన కంగారుపడిపోతూ శంకరుడి దగ్గరికి పరిగెత్తుతాడు. తన వ్యాధిని నివారించమని ప్రాధేయపడతాడు.

ప్రస్తుతం పంచధార్లగా పిలవబడుతోన్న ఈ ప్రదేశంలో మరుగునపడిపోయిన స్వయంభువు శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేయమనీ, ఫలితంగా వ్యాధి బారి నుంచి బయటపడతావని శివుడు చెబుతాడు. స్వామి ఆదేశంమేరకు నడచుకున్న యమధర్మరాజు ఆ వ్యాధి బారి నుంచి విముక్తి పొందుతాడు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు తన అనుగ్రహం కూడా ఉంటుందనీ, శివుడే నేరుగా ఆదేశిస్తే తప్ప వారికి యమదండన ఉండదని సెలవిస్తాడు.

యమధర్మరాజుచే పూజలందుకున్న కారణంగానే ఇక్కడి శివుడిని 'ధర్మలింగేశ్వరుడు' గా కొలుస్తుంటారు. ఇక్కడ 'పంచధార్ల' పేరుతో ప్రవహిస్తోన్న అయిదు నీటి ధారలు పరమశివుడి పంచముఖాల నుంచి వెలువడుతున్నట్టుగా విశ్వసిస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ క్షేత్రానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులు ముందుగా ఈ నీటి ధారలలో స్నానమాచరించి, ధర్మలింగేశ్వరుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామివారికి జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో పాల్గొని పునీతులవుతుంటారు.

More Bhakti Articles