వాయులింగం ప్రత్యేకత

వాయులింగం ప్రత్యేకత
పంచభూతాలలో ఒకటైన వాయులింగం శ్రీకాళహస్తిలో దర్శనమిస్తుంది. 'శ్రీ' అనగా సాలెపురుగు ... 'కాళము' అనగా పాము ... 'హస్తి' అనగా ఏనుగు. ఈ మూడు ఇక్కడ శివుడిని సేవించి తరించిన కారణంగా ఈ ప్రదేశానికి శ్రీకాళహస్తి అనే పేరురాగా, స్వామివారు 'శ్రీకాళహస్తీశ్వరుడు'గా కొలవబడుతున్నాడు. సువర్ణముఖీ నదీ తీరంలో ఆవిర్భవించిన ఇక్కడి శివుడినే 'తిన్నడు' సేవించి 'కన్నప్ప' గా చరిత్రలో మిగిలిపోయాడు.

గర్భాలయం తలుపులు మూసినా, స్వామివారికి ఎదురుగా గల దీపం గాలికి కదులుతూ ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడి శివలింగాన్ని 'వాయులింగం' గా పేర్కొంటూ ఉంటారు. సాధారణంగా శైవ క్షేత్రాలన్నింటిలోను శివలింగం నున్నగా ... నల్లగా ... గుండ్రంగా కనిపిస్తుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడి క్షేత్రంలో శివలింగం తెల్లగా ... నలుపలకలుగా ఉండటం విశేషం.

పార్వతీదేవికి పరమశివుడు 'పంచాక్షరి' మంత్రాన్ని ఉపదేశించినది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే అమ్మవారు 'జ్ఞానప్రసూనాంబ' గా పిలవబడుతోంది. సువర్ణముఖి ఉత్తరంవైపు ప్రవహిస్తూ ఉండటం ... శివలింగం పశ్చిమాభి ముఖంగా ఉండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు.

పంచభూత లింగాలలో వాయులింగం అత్యంత శక్తిమంతమైనదిగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువల్లనే అర్చకులు సైతం ఈ లింగాన్ని తాకకుండా ఉత్సవమూర్తికి అభిషేకం జరుపుతుంటారు. అటు పురాణపరమైన నేపథ్యం ... ఇటు చారిత్రక పరమైన వైభవం కలిగిన ఈ క్షేత్రంలో ఆదిదేవుడిని అభిషేకించకపోవడం ప్రత్యేకతగా కనిపిస్తుంది ... విశిష్టతగా అనిపిస్తుంది.

More Bhakti Articles