ఏ గణపతిని పూజిస్తే ఏ దోషం తొలగుతుంది ?

ఏ గణపతిని పూజిస్తే ఏ దోషం తొలగుతుంది ?
ఏ దేవుడికి సంబంధించిన పూజచేసినా ... ఏ దేవతకి సంబంధించిన వ్రతం చేసినా ముందుగా వినాయకుడిని ఆరాధిస్తూ ఉండటం అనాదిగా వస్తోంది. వినాయకుడిని ఆహ్వానించకుండా ... ఆరాధించకుండా చేసే ఏ పూజ కూడా ఫలితాన్ని సాధించలేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

వినాయకుడి ఆలయంలో అడుగుపెట్టడం వలన ... ఆయనకి ప్రదక్షిణలు చేయడం వలన ... ఆయన ఎదురుగా గుంజీళ్లు తీయడం వలన సమస్త పాపాలు నశించిపోతాయి. ఇక గ్రహ సంబంధమైన దోషాల విషయానికే వస్తే, ఒక్కో వినాయకుడిని పూజించడం వలన ఒక్కో దోషం తొలగిపోతుందని చెప్పబడుతోంది.

'ఎర్రచందనం'తో తయారుచేసిన వినాయకుడిని పూజించడం వలన సూర్యగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. ఇక చంద్ర గ్రహ సంబంధిత దోషాలతో బాధపడేవారు 'పాలరాయి గణపతి'ని ఆరాధించాలి. 'రాగి'తో తయారుచేయబడిన వినాయకుడిని అర్చించడం వలన కేతుగ్రహ సంబంధమైన దోషాలు నివారించబడతాయి. బుధ గ్రహ పరమైన దోషాలతో ఇబ్బందులు పడుతున్న వారు 'మరకతం' తో చేయబడిన గణపతిని పూజించాలి.

ఇక గురుగ్రహ సంబంధమైన దోషాలను దూరం చేసుకోవాలంటే, 'పసుపు'తో చేయబడిన వినాయకుడిని సేవించాలి. 'స్పటిక గణపతి'ని ఆరాధించడం వలన శుక్రగ్రహపరమైన దోషాలు తొలగిపోతాయి. శనిగ్రహపరమైన దోషాల నుంచి బయటపడాలనుకునే వాళ్లు నల్లరాయితో చేసిన గణపతిని పూజించాలి. అలాగే 'మట్టి గణపతి'ని ఆరాధించడం వలన రాహుగ్రహ దోషాలు, శ్వేతార్కమూల గణపతిని పూజించడం వలన కేతుగ్రహ దోషాలు నివారించబడతాయని చెప్పబడుతోంది.

More Bhakti Articles