అంతుచిక్కని వినాయకుడి తొండం !

అంతుచిక్కని వినాయకుడి తొండం !
ప్రపంచవ్యాప్తంగా వినాయకుడు వివిధ నామాలతో పిలవబడుతూ, అశేష భక్తజనకోటిచే పూజించబడుతున్నాడు. అలాంటి వినాయకుడికి తొండం కుడివైపుకి తిరిగి ఉంటే మంచిదా ... ఎడమ వైపుకి తిరిగి ఉంటే మంచిదా అని కొంతమంది సందేహాన్ని వ్యక్తంచేస్తూ ఉండటం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో అసలు తొండమేలేని వినాయకుడిని చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యంకలగక మానదు. అలాంటి వినాయకుడి ప్రతిమ విశాఖ జిల్లాలోని 'చోడవరం' లో కనిపిస్తుంది.

ఇక్కడి వినాయకుడికి తొండం లేకపోవడాన్ని లోటుగా ... లోపంగా ఎవరూ చెప్పుకోరు. అదే ఇక్కడి స్వామి విశిష్టతగా భావిస్తుంటారు ... అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కాణిపాకంలోగల వినాయకుడు తరువాత అంతటి మహిమాన్వితుడిగా ఇక్కడి వినాయకుడిని గురించి చెప్పుకుంటారు. ఇక్కడి వినాయకుడికి తొండం లేకపోవడం గురించిన ఆసక్తికరమైన కథనం ఒకటి స్థలపురాణంగా వినిపిస్తూ ఉంటుంది.

పూర్వం ఇక్కడి శివాలయంలో స్వయంభువు వినాయకుడిని ప్రతిష్ఠించాలని గ్రామస్తులు అనుకున్నారు. వారి సంకల్ప బలం కారణంగా అనతికాలంలోనే ఓ వ్యక్తికి ఈ ప్రదేశంలో వినాయకుడు స్వయంభువుగా భూమిలో కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఆ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేస్తాడు. అంతా కలిసి స్వామి ప్రతిమను బయటికి తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో తొండం తెగిన వినాయకుడి విగ్రహం బయటపడుతుంది.

ఇక ఆ తొండం కూడా బయటికి తీస్తే స్వామివారికి అంటించవచ్చని చూస్తారు. కానీ ఎంత పొడవుగా తవ్వుతూ వెళ్లినా ఆ తొండం మధ్యభాగమే తప్ప, ముందుభాగం మాత్రం ఎక్కడ ఉందనేది వాళ్లకి తెలియకుండాపోతుంది. తొండం కోసం వాళ్లు మట్టితీస్తూ వెళ్లడం వలన, ఆ ప్రదేశమంతా కూడా చెరువు కోసం మట్టి తవ్వినట్టుగా అవుతుంది. ఇప్పుడీ ప్రదేశంలో చెరువే దర్శనమిస్తుంది. దీనిని స్థానికులు 'ఏనుగు బోదె' గా పిలుస్తూ ఉంటారు. మహిమాన్వితుడైన ఇక్కడి వినాయకుడిని పూజించడం వలన కార్యసిద్ధి కలుగుతుందని చెబుతుంటారు.

More Bhakti Articles