శివరాత్రికి ధర్మకుండ స్నాన ఫలితం

శివరాత్రికి ధర్మకుండ స్నాన ఫలితం
అమ్మా అని పిలిస్తే తల్లి కూడా కాస్త ఆలస్యంగా వస్తుందేమో కానీ, ఆదిదేవుడు ఆ మాత్రం ఆలస్యం కూడా చేయడు. ఆయన మనసు మంచుకన్నా చల్లన ... మైనం కన్నా మెత్తన. అందుకే ఎంతోమంది దేవతలు ... మహర్షులు ... మహారాజులు ... మహాభక్తులు ... సాధారణ జనులు ఆయన ఆదరణతో ... అనుగ్రహంతో తరించారు. అడగగానే అమృతంతో దాహం తీరుస్తాడు గనుకనే, అశేష సంఖ్యలో భక్తులు ఆయనను దర్శించుకుంటూ ఉంటారు.

ఇక విశేషమైన పర్వదినంగా చెప్పబడే మహాశివరాత్రి రోజున, ఆయన పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తులకు పుట్టినిళ్లుగా మారిపోతాయి. అలాంటి విశిష్టమైన రోజున భక్తులు ఆయా పుణ్యక్షేత్రాలలోని పుష్కరిణిలలో స్నానమాచరించి సమస్త పాపాల నుంచి విముక్తిని పొందుతుంటారు. అలాంటి పుష్కరిణిలలో కరీంనగర్ జిల్లా వేములవాడ క్షేత్రంలోని పుష్కరిణి అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది.

రాజరాజేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రంలోని ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వలన పాపాలు ... దోషాలు ... వాటి వలన సంక్రమించే వ్యాధులు నశిస్తాయని చెప్పబడుతోంది. ఎవరు దేనిని ఆశించి దీంట్లో స్నానం చేస్తారో ఆ ఫలితం వారికి వెంటనే లభిస్తుందని అంటారు. 'ధర్మకుండం' పేరుతో పిలవబడే ఈ పుష్కరిణిలో సూర్యుడు స్నానం చేసినట్టు చెబుతారు. సదాశివుడి ఆదేశం మేరకు వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వసం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న సూర్యుడు కూడా తన చేతులను కోల్పోతాడు.

అప్పుడు ఆయన ఇక్కడి ధర్మకుండం మహిమాన్వితమైనదని తెలుసుకుని వచ్చి దీనిలో స్నానం చేశాడనీ, ఫలితంగా యథావిధిగా చేతులు వచ్చాయని స్థలపురాణం చెబుతుంది. లోకాలకు వెలుగునిచ్చే సూర్యుడికే చేతులను ఇచ్చిన ఈ పుష్కరిణిని అత్యంత పుణ్యప్రదమైనదిగా భక్తులు భావిస్తుంటారు. మహాశివరాత్రి సమయంలో ఈ పుష్కరిణిలో స్నానమాచరించి ఆ దేవదేవుడిని దర్శించి తరిస్తుంటారు.

More Bhakti Articles