పృథ్వీలింగం ప్రత్యేకత

పృథ్వీలింగం ప్రత్యేకత
మహాశివరాత్రి వస్తుందనగానే ఆ రోజున ఏ శైవక్షేత్రాన్ని దర్శించాలా అని ఆలోచించుకుని అందుకు తగిన విధంగా భక్తులు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి రోజున మహాదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శించడం వలన ... అక్కడి పూజాభిషేకాలను కనులారా తిలకించడం వలన ... ఆ పవిత్రమైన ప్రదేశంలో ఉపవాసంతో జాగరణ చేయడం వలన మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే ఆయా శైవ క్షేత్రాలు ఈ రోజున భక్త జనసందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో కొంతమంది జ్యోతిర్లింగ క్షేత్రాలను ... కొందరు పంచారామాలను ... మరికొందరు పంచభూత లింగాలను దర్శించుకుంటూ ఉంటారు. సమస్త మానవాళి మనుగడ పంచభూతాలపై ఆధారపడి ఉందికనుక, పంచభూత క్షేత్రాల్లో ఏ ఒక్కదానిని దర్శించినా చాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటివారికి 'కంచి' లో 'పృథ్వీ లింగం' గా ఆవిర్భవించిన 'ఏకాంబరేశ్వరుడు' ముందుగా గుర్తుకువస్తాడు.

ఈ ప్రదేశంలో గల మామిడిచెట్టు క్రింద మట్టితో చేసిన శివలింగాన్ని పార్వతీదేవి పూజించిన కారణంగా ఇది 'పృథ్వీలింగం' గా కొలవబడుతోంది. అమ్మవారికి నీడనిచ్చిన ఇక్కడి మామిడి చెట్టుకి నాలుగు కొమ్మలకి నాలుగు రకాల మామిడి పండ్లు కాస్తూ వుండటం విశేషం. 40 ఎకరాల విస్తీర్ణంగల ఈ క్షేత్రంలో ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు కొలువుదీరి ఉంటడం మరో ప్రత్యేకతగా చెబుతుంటారు. కామాక్షీదేవి సమేతంగా ఏకాంబరేశ్వరుడు అనుగ్రహించే ఈ క్షేత్రాన్ని శివరాత్రి రోజున దర్శించడం వలన సమస్త పాపాలు నశిస్తాయనీ ... సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.

More Bhakti Articles