గర్భగుడిలోకి పరిగెత్తిన భక్తుడు !

గర్భగుడిలోకి పరిగెత్తిన భక్తుడు !
గౌరాంగుడు ... చైతన్యమహాప్రభువుగా మారడానికి ముందు, పూరీ క్షేత్రంలో ఓ అనూహ్యమైన సంఘటన జరిగింది. శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ ... సేవిస్తూ అనుక్షణం ఆ ఆనందపారవశ్యంలో గౌరాంగుడు తేలిపోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సహచరులతో కలిసి పూరీ క్షేత్రానికి చేరుకున్నాడు. పూరీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి, ఆ స్వామిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆయన మనసు ఆరాటపడసాగింది.

ఆలయాన్ని సమీపిస్తూ ఉండగానే ఆయన నడకలో వేగం పెరగసాగింది. ఆయనని అనుసరించే క్రమంలో సహచరులు పరిగెత్తసాగారు. ఆలయంలోకి అడుగుపెడుతూ ఉండగానే చైతన్య మహాప్రభువు కళ్ల వెంట నీరు ధారలుగా కారిపోసాగింది. ఆయన ధోరణిని అక్కడి భక్తులు వింతగా చూడసాగారు. ఆలయంలో భక్తులు ఎంతమంది ఉన్నారో ... వాళ్లు తనని చూసి ఏమనుకుంటున్నారో ... అసలు తాను ముందుకు వెళ్లడానికి అక్కడ వీలుగా ఉందో లేదో కూడా తెలుసుకోలేని స్థితిలో గౌరాంగుడు ఉన్నాడు.

ఆయన దృష్టి గర్భాలయంలోని స్వామివారిపై మాత్రమే ఉంది. ఏదో శక్తి ఆవహించినవాడిలా ఆయన ఆ వైపుకి దూసుకు వెళ్లసాగాడు. నేరుగా ఆయన గర్భాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడనే విషయాన్ని గ్రహించి, ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో కృష్ణుడితో ఎడబాటుని తట్టుకోలేనివాడిలా కృష్ణా ... కృష్ణా అంటూ పెద్దగా అరుస్తూ ఆయన కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారిలో ఒక్క వాసుదేవ సార్వభౌముడుకి మినహా, మిగతా వారికి ఈ సంఘటన ఆశ్చర్యాన్ని కలిగించింది.

గౌరాంగదేవుడి స్థితి వాసుదేవ సార్వభౌముడికి అర్థమైంది. కృష్ణుడికి దూరంగా గౌరాంగదేవుడు ఉండలేడని గ్రహించిన ఆయన, ఆ క్షేత్రంలో ఉండటానికి తగిన ఏర్పాట్లుచేశాడు. అప్పటి నుంచి గౌరాంగుడు నిరంతరం స్వామివారిని దర్శిస్తూ ... సేవిస్తూ ... కీర్తిస్తూ తరించాడు. ఎందరి భక్తుల మనసులనో జయించి కృష్ణ చైతన్య మార్గంలో నడిపించాడు.

More Bhakti Articles