సంతోషాలనిచ్చే సంతోషిమాత క్షేత్రం

సంతోషాలనిచ్చే సంతోషిమాత క్షేత్రం
జీవితంలో అడుగు ముందుకు వేసేలా చేసేది ... గమ్యానికి చేరుకోవడానికి కావలసిన శక్తిని ప్రసాదించేది సంతోషమే. సమస్యలను ఎదిరించే సాధనం ... ఆయుధం సంతోషమే. అది అందాన్నిస్తుంది ... ఆరోగ్యాన్నిస్తుంది ... ఆయుష్షును ఇస్తుంది. అలాంటి సంతోషాన్ని అనుగ్రహించే దైవమే సంతోషిమాత. ఆ తల్లి ఆవిర్భవించిన క్షేత్రాలు అరుదుగా ఉన్నప్పటికీ, ప్రతి క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.

అలాంటి విశిష్టతను సొంతం చేసుకున్న క్షేత్రం, పాత శ్రీకాకుళంలోని నాగావళి నదీ తీరంలో దర్శనమిస్తుంది. చాలాకాలం క్రిందట ఒక భక్తుడి కలలో అమ్మవారు కనిపించి ఆదేశించిన కారణంగా, ఇక్కడ ఈ ఆలయం నిర్మించబడిందని స్థానికులు చెబుతారు. ఆనాటి నుంచి ఇక్కడి అమ్మవారిని అంతా తమ ఇలవేల్పుగా ఆరాధిస్తూ ఉంటారు.

ఈ తల్లిని దర్శించడం వలన శుభవార్తలు వినడం ... శుభప్రదమైన పనులను చేపట్టడం ... శుభకార్యాలలో పాల్గొనడం వంటి సంతోషకరమైన పనులు జరిగిపోతూ ఉంటాయి. బారసాల ... అన్నప్రాసన ... అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు అమ్మవారి సన్నిధిలో జరపడానికి భక్తులు ఆసక్తిని చూపుతుంటారు. ప్రతి శుక్రవారం విశేష సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు.

దసరా నవరాత్రుల ఉత్సవాలు ... అమ్మవారి వార్షికోత్సవ సంబరాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతుంటారు. ఈ సమయంలో ఈ క్షేత్రం భక్తుల సందడితో రద్దీగా కనిపిస్తుంది. ఇక ఇదే ప్రాంగణంలో ప్రత్యేక మందిరాల్లో కొలువుదీరిన గణపతి ... సుబ్రహ్మణ్యస్వామి ... దుర్గాదేవి భక్తులచే పూజలను అందుకుంటూ ఉంటారు. అమ్మవారితో కలిసి సంతోషాల సిరులను అనుగ్రహిస్తూ ఉంటారు.

More Bhakti Articles