శ్రీ శైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు

 శ్రీ శైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఓం నమఃశివాయ అంటూ ఒక చెంబెడు నీళ్లతో శివుడిని అభిషేకించి, దోసిటతో ఓ నాలుగు పువ్వులు సమర్పిస్తే చాలు ఆయన ఆనందంతో పొంగిపోయి అడగకుండానే వరాల వర్షం కురిపిస్తాడు. అలాంటి చల్లని మనసున్న మహాదేవుడు లింగరూపంలో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించి భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అనంతమైన ఈ విశ్వం అంతా కూడా దేనియందు లీనమై ఉన్నదో ఆ పరబ్రహ్మమే లింగమని చెప్పబడుతోంది. అలా పరమశివుడు మహాలింగంగా ఆవిర్భవించి ... మల్లికార్జునుడు పేరుతో పూజలందుకుంటోన్న క్షేత్రం 'శ్రీశైలం'.

జ్యోతిర్లింగ క్షేత్రంగా ... శక్తిపీఠంగా విశిష్టతను సంతరించుకున్న శ్రీశైలం సిద్ధ క్షేత్రంగా కూడా అలరారుతోంది. ఇంతటి ప్రత్యేకతను సొంతం చేసుకున్న శ్రీశైలంలో 'మహాశివరాత్రి' సందర్భాన్ని పురస్కరించుకుని 11 రోజులపాటు అంగరంగవైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినానికి వారంరోజుల ముందుగానే ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవ వేడుకలు, శివరాత్రి తరువాత మూడు రోజులపాటు కొనసాగుతూ ఉంటాయి.

తొలి రోజున అంకురార్పణ ... ధ్వజారోహణ జరుపుతారు. రెండవ రోజున 'హంసవాహన సేవ' .. మూడవ రోజున 'మయూర వాహన సేవ' .. నాలుగో రోజున 'భ్రుంగి వాహన సేవ' .. అయిదో రోజున 'రావణ వాహన సేవ' .. ఆరో రోజున 'కైలాస వాహనసేవ' .. ఏడో రోజున ' గజవాహన సేవ' నయన మనోహరంగా నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి రోజున 'లింగోద్భవకాల మహారుద్రాభిషేకం' జరుపుతారు. స్వామివారికి ప్రత్యేకంగా పాగాలంకరణ చేసి, కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. ఈ రోజున 'నందివాహన సేవ'లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఇక తొమ్మిదవ రోజున 'రథోత్సవం' ... పదో రోజున పూర్ణాహుతి .. ధ్వజావరోహణ ... అశ్వవాహన సేవ కార్యక్రమాలు జరుగుతాయి. పదకొండో రోజున జరిగే ఏకాంతసేవ ... పుష్పోత్సవం ... శయనోత్సవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాదిమంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించి ధన్యులవుతుంటారు. నయనానందకరంగా ... హృదయానందభరితంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించి, ఆదిదంపతుల ఆశీస్సులు అందుకుంటే ఆశించే మోక్షం అవలీలగా లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

More Bhakti Articles