చంద్రోదయ ఆలయం ప్రత్యేకత

చంద్రోదయ ఆలయం ప్రత్యేకత
నీలాకాశంలోని నీలిరంగుని ... వెన్నెలలోని వెండితనాన్ని పులుముకుని అందానికే అందంగా 'చంద్రోదయ ఆలయం' కనిపిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ ఆలయం, ఇస్కాన్ ప్రధాన కేంద్రంగా చెప్పబడుతోన్న 'మాయాపూర్' ( పశ్చిమ బెంగాల్) లో దర్శనమిస్తుంది.

ఇస్కాన్ వ్యవస్థాపకుడైన శ్రీలప్రభుపాదుల వారి సూచన మేరకు ఓ కృష్ణ భక్తుడు అతిఖరీదైన ఈ ఆలయ నిర్మాణానికి పూనుకోవడం విశేషం. ఇక ఆ భక్తుడు ఓ విదేశీయుడు కావడం ఈ ఆలయ నిర్మాణంలో చోటుచేసుకున్న ప్రత్యేకత. 'ఫోర్డ్' కంపెనీ వ్యవస్థాపకుడైన హెన్రీ ఫోర్డ్ మనవడైన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ వందలాది కోట్ల రూపాయలతో ఈ ఆలయ నిర్మాణానికి నడుంబిగించాడు.

మహా శ్రీమంతుల కుటుంబంలో జన్మించిన ఆయన మతం మార్చుకుని శ్రీకృష్ణుడిని ఆరాధించడానికీ ... ప్రపంచ చరిత్రలో నిలిచేపోయే కృష్ణ మందిరాన్ని నిర్మించడానికి కారణం అనుకోకుండా ఆయన కంట పడిన 'భగవద్గీత'. భారతీయులు అత్యంత పవిత్రమైనదిగా భావించే ఈ గ్రంధం అయన మనసును ఎంతగానో ప్రభావితం చేసింది. ఇతరులు ఆశ్చర్యపోయేలా ఆయన జీవన విధానాన్ని మార్చేసింది.

ఎక్కడైనా ఓ కృష్ణ మందిరాన్ని నిర్మించాలని అనుకున్న ఆయన, ఆ పనిని డెట్రాయిట్ లో పూర్తిచేశాడు. ఆలయ ప్రారంభోత్సవానికి ప్రభుపాదులవారు వచ్చారు. ఆ సమయంలో వాళ్ల మధ్య జరిగిన సంభాషణ మాయాపూర్ లోని చంద్రోదయ ఆలయానికి శంఖుస్థాపన జరిగేలా చేసింది. శ్రీకృష్ణుడి లీలా విశేషాలకు ... విన్యాసాలకు ప్రతీకగా కనిపించే ఈ ఆలయం చూసితీరవలసిందే. చంద్రుడి నుంచి వెన్నెలను గ్రహించి, దానికి ఆధ్యాత్మిక పరిమళాలు అద్ది అందంగా ఆవిష్కరించే వేదికగా ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది ... కనువిందు చేస్తూ ఉంటుంది.

More Bhakti Articles