అప్పుల బాధలను తొలగించే వినాయకుడు

జీవితంలో కొన్ని అవసరాలు తెలిసే వస్తుంటాయి ... ఆపదలు అనుకోకుండానే వస్తుంటాయి. అవసరాలు తీరాలన్నా ... ఆపదల నుంచి గట్టెక్కాలన్నా అందుకు డబ్బు అవసరమవుతుంది. అవసరానికి మించిన డబ్బు చేతిలో లేనపుడు ఎవరైనా సరే అప్పు చేస్తుంటారు. ముఖ్యంగా పిల్లల పైచదువుకి ... పెళ్లిళ్లకి ... ఇల్లు కట్టుకోవడానికి అప్పు చేయడమనేది తప్పనిసరి అవుతుంటుంది.

అప్పుతెచ్చిన డబ్బును ఖర్చుచేయడం ఎంత తేలికగా అనిపిస్తుందో ... ఆ అప్పును తీర్చడం అంత కష్టంగా అనిపిస్తుంది. తప్పనిసరై చేసిన అప్పు ... ఆ తరువాత తప్పు చేశామేమోననే భావనను కలిగిస్తూ ఉంటుంది. కారణమేదైనా అప్పులు చేసి అవి తీర్చలేక తిప్పలు పడుతున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారనేది నిజం. ఎవరికీ వారు తమని అప్పుల ఊబిలో నుంచి బయటపడేయమని ఇష్టదైవాలను ప్రార్ధిస్తూ ఉంటారు.

అయితే అప్పుల బాధను అనుభవిస్తున్న వాళ్లు గణపతిని పూజించడం వలన ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. మంచి కార్యాలకు ఆటంకాలు తొలగించడమే కాదు, అత్యవసరమై చేసిన అప్పులు తీర్చడంలోను వినాయకుడు ముందుంటాడని స్పష్టం చేస్తున్నాయి. విశేషమైన పుణ్యతిధి కలిగిన ఒక బుధవారం రోజున గణపతిని పూజించాలి. ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన పసుపు రంగు వస్త్రాలను ధరించాలి.

పూజామందిరాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించాలి. పీఠంపై ఒక పళ్లాన్ని ఏర్పాటుచేసుకుని దాంట్లో గణపతి ప్రతిమను ఉంచాలి. ఆయన ఎదురుగా 'రుణ విమోచక యంత్రం' ఉంచి దానిని పంచామృతాలతో అభిషేకించాలి. రుణ విమోచక గణపతి స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి. ఆ తరువాత వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా గణపతిని ఆరాధించడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది.

గణపతి కరుణ వలన, అప్పులు తీర్చడానికి అవసరమైన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అప్పటి వరకూ ఉపాధి మార్గానికిగల ఆటంకాలు తొలగిపోవడం ... వ్యాపారం పుంజుకోవడం ... కోర్టు కేసుల్లో తీర్పు అనుకూలంగా రావడం వంటివి జరుగుతాయి. ఫలితంగా అప్పుల బాధ నుంచి బయటపడటం జరుగుతుంది. అప్పులు చేసిన వాళ్లు రుణ విమోచనకారుడైన గణపతి అనుగ్రహంతో ఆ గండం నుంచి గట్టెక్కుతారు. అయితే ఈలోగా ఎంతో మానసిక క్షోభను అనుభవించవలసి వస్తుంది. అందువలన అత్యవసరాలకే తప్ప ఆడంబరాలకు అప్పుచేయకూడదు. అప్పుతెచ్చుకోవడమంటే ... ముప్పుతెచ్చుకోవడమేననే విషయాన్ని గ్రహించాలి.


More Bhakti News