మహిమ చూపిన మహాశివుడు

మహిమ చూపిన మహాశివుడు
సాధారణంగా ఏదైనా ఒక క్షేత్రంలో అక్కడి దైవం ఓ సామాన్యుడి విషయంలో మహిమచూపితే అది వెలుగుచూసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే ఆ దైవం మహారాజుల విషయంలో మహిమచూపితే అది చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి సంఘటన ఒకటి మనకు గుంటూరు సమీపంలో గల 'పెదకాకాని' లో దర్శనమిస్తుంది. ఎంతో ప్రాచీనమైన వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో శ్రీభ్రమరాంబా మల్లేశ్వరస్వామి' భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.

సమస్త కళలను సాదరంగా ఆహ్వానించి సత్కరించిన శ్రీకృష్ణదేవరాయలు, ఈ క్షేత్రంపట్ల అపారమైన ఆదరాభిమానాలు చూపాడట. అందుకు కారణం ఆయన కోరిక ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన తీరడమే. శ్రీకృష్ణదేవరాయలు అనేక కళలను ప్రోత్సహిస్తూ ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడట. అలాంటి ఆయన ఏ మాత్రం సమయం దొరికినా పుత్ర సంతానం గురించి ఆలోచిస్తూ ఆవేదనకి లోనయ్యేవాడు.

ఆయన మంత్రులలో ఒకడైన రెంటూరి చిట్టరుసు ఈ విషయాన్ని గమనిస్తాడు. తన ఊరులో ఆవిర్భవించిన సదాశివుడు మహిమాన్వితుడనీ ... ఆయన దర్శనం చేసుకుంటే రాయలవారి కోరిక నెరవేరుతుందని చెబుతాడు. రాయలవారు అంగీకరించడంతో ఆయనని వెంటబెట్టుకుని పెదకాకాని క్షేత్రానికి తీసుకువస్తాడు. రాయలవారు స్వామివారి దర్శనం చేసుకుని తనకి పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు.

సదాశివుడి అనుగ్రహం కారణంగా అనతికాలంలోనే రాయలవారి దంపతులకు మగబిడ్డ జన్మిస్తాడు. ఈ కారణంగానే రాయలవారు ఆ బిడ్డకి 'సదాశివరాయలు' అని నామకరణం చేస్తాడు. స్వామి పట్ల కృతజ్ఞతా భావంతో ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినట్టు చరిత్ర చెబుతుంది. అలా మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.

More Bhakti Articles