మహారాజులు విశ్వసించిన మహిమాన్విత క్షేత్రం

మహారాజులు విశ్వసించిన మహిమాన్విత క్షేత్రం
సకల దేవతలు ... సమస్త ఋషులు శ్రీమహావిష్ణువును ... పరమశివుడిని ... ఆదిపరాశక్తిని ఆరాధిస్తూ ఉంటారు. దుష్టశిక్షణ ... శిష్టరక్షణ చేయడంలోను, లోకాలను ప్రళయం బారి నుంచి కాపాడటంలోను ఈ ముగ్గురు ప్రధానమైన పాత్రను పోషిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆదిదేవుడు ... ఆదిపరాశక్తి ... శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించిన క్షేత్రాలు భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాయి.

అయితే ఈ ముగ్గురూ ఒకే క్షేత్రంలో ఆవిర్భవించడం అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఆవిర్భవించిన క్షేత్రాలు మరింత విశిష్టతను సంతరించుకుని విలసిల్లుతున్నాయి. చిత్తూరు జిల్లా 'రేణిగుంట' క్షేత్రం ఈ జాబితాలో మనకి దర్శనమిస్తుంది. కారణమేదైనా పురాణపరమైన ... చారిత్రక పరమైన నేపథ్యం గల అనేక క్షేత్రాలు చిత్తూరు జిల్లాలో అలరారుతున్నాయి. ఆ జిల్లాలోనే ప్రత్యేకతను సంతరించుకున్నదిగా రేణిగుంట కనిపిస్తుంది.

ఇక్కడ ప్రాచీనకాలంనాటి జగన్మాత ఆలయం ... సిద్ధేశ్వరస్వామి ఆలయం ... లక్ష్మీనారాయణుల ఆలయం కొలువుదీరి కనిపిస్తాయి. ఈ మూడు ఆలయాలు అత్యంత మహిమాన్వితమైనవిగా చెబుతారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఇందుకు ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. పల్లవులు ... చోళులు ... విజయనగర రాజులు ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకుని వచ్చి ఇక్కడి దైవాలను దర్శించుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి.

ఈ రాజులంతా కూడా తాము సాధించిన విజయాలకు, చేకూరిన శుభాలకు కారణం ఇక్కడి దైవదర్శనమేనని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారట. అందువల్లనే ఈ ఆలయాల అభివృద్ధికి అంతా కూడా తమవంతు కృషిచేశారు. ఆనాటి ప్రజలకు ... పరిపాలకులకు ఇక్కడి దైవాలపై గల విశ్వాసం నేటికీ కొనసాగుతూనే ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం ఇక్కడి దైవాలు అత్యంత శక్తిమంతమైనవిగా భావిస్తుంటారు. విశేషమైన రోజుల్లో ఇక్కడ ఘనంగా జరిగే ఉత్సవాల్లో అశేషంగా పాల్గొని పునీతులవుతుంటారు.

More Bhakti Articles