దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఏం జరుగుతుంది ?

దైవ నిర్ణయాన్ని ధిక్కరిస్తే ఏం జరుగుతుంది ?
వివిధ దైవ క్షేత్రాలను దర్శిస్తున్నప్పుడు అక్కడగల నియమ నిబంధనలు ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. సాక్షాత్తు ఆ క్షేత్రంలో ఆవిర్భవించిన దైవమే ఆ నియమాన్ని విధించిందని తెలిసినప్పుడు మరింత విస్మయం కలుగుతూ ఉంటుంది. సాధారణంగా దైవ నిర్ణయమే అక్కడి సంప్రదాయమై కొనసాగుతూ ఉన్నప్పుడు, దానిని మార్చడానికి ఎవరూ సాహసించరు. ఒకవేళ ఎవరైనా ఆ ధైర్యంచేస్తే ఎలా ఉంటుందనడానికి నిదర్శనంగా నిలిచే సంఘటన మనకి పశ్చిమ గోదావరి జిల్లాలోని 'ఉప్పులూరు' లో దర్శనమిస్తుంది.

ఇక్కడి చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామి మనసు దోచుకున్న ఓ దళిత కుటుంబీకులు అర్చకులుగా కొనసాగుతూ ఉంటారు. తాను అక్కడికి తరలిరావడానికి ఆ దళిత కుటుంబీకులు కారకులు కావడం వలన, తరతరాలుగా తనని అర్చించే అర్హతను వారికి స్వామి ప్రసాదిస్తాడు. అయితే ఇదంతా ప్రచారమేనని కొందరు కొట్టిపారేస్తారు. దళితులను తొలగించడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభిస్తారు.

అందుకు ఆదేశాలు జారీ చేయవలసిన సంస్థానాధీశుడిని కలిసి లేనిపోనివి కల్పించి చెప్పి ఆయన అనుమతిని తీసుకుంటారు. అయితే ఊహించని విధంగా ఆ సంస్థానాధీశుడు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతాడు. ఆలయ అర్చకులుగా ఉన్న దళితులను తొలగించడానికి ఆయన నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు. తక్షణమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని తొందరపెడతారు.

ప్రాణాపాయంలో పడిన రాజావారు అందుకు అంగీకరించి, దళితులను అర్చక పదవుల నుంచి తొలగించమంటూ తాను ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకుంటాడు. దాంతో ఆయన పరిస్థితి మెరుగుపడి అనతికాలంలోనే అనారోగ్యం నుంచి కోలుకుంటాడు. స్వామివారి నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు మన్నించమని కోరడమే కాకుండా, నిత్య ధూప దీప నైవేద్యాలకు ఎలాంటి లోటు రాకుండా శాశ్వత ఏర్పాట్లు చేస్తాడు.

More Bhakti Articles