గోద్వాదశి వ్రతం

గోద్వాదశి వ్రతం
స్త్రీలకు సౌభాగ్యాన్ని ... సకల సంపదలను అనుగ్రహిస్తూ, వారి పాపాలను హరింపజేసే వ్రతాల్లో 'గోద్వాదశి'వ్రతం ఒకటి. అన్ని వ్రతాల మాదిరిగానే ఈ వ్రతానికి కూడా పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. నివాస గృహంలోని పూజా మందిరాన్ని పరిశుభ్ర పరిచి ముగ్గులు పెట్టాలి. పీఠం పై కలశాన్ని వుంచి దానిపై వెండి పాత్రగానీ ... రాగి పాత్రను గాని వుంచి దానిలో బియ్యం పోసి వెండితో చేసిన శివపార్వతుల ప్రతిమలను ఉంచాలి. ఇక పీఠంపై గరుడ వాహనధారి అయిన విష్ణుమూర్తి వెండి ప్రతిమను ఉంచాలి. ఈ దేవతలను ద్వాదశోపచార విధానంగా పూజించాలి. ఆ తరువాత దూడతో సహా కపిల గోవును పూజించాలి. ఆవు నేతితో అఖండ దీపాన్ని వెలిగించి ... ఉపవాసంతో పాటు ఆ రాత్రంతా జాగరణ చేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే పునఃపూజ చేసి తమ స్థాయికి తగినట్టుగా బాహ్మణులను ... ముత్తయిదువులను సత్కరించి పంపాలి.

ఇక ఈ వ్రతాన్ని గురించిన ప్రస్తావన మనకి పురాణాల్లో కనిపిస్తోంది. పూర్వం కౌండిన్యుడి భార్య అయిన గోమతీ దేవి 'గోద్వాదశి' వ్రతం చేయాలని అనుకుంది. భర్త అనుమతితో అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంది. ఉదయాన్నే తల స్నానం చేసి, ఇంట్లోని పరిశుభ్రమైన ప్రదేశంలో అలికి ముగ్గులు పెట్టింది. ఆ స్థానంలో మంటపాన్ని ఏర్పాటు చేసుకుని, భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తరువాత దూడతో సహా కపిల గోవును గంధంతోను ... పుష్పాక్షితలతోను పూజించింది. నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించి ఆ రాత్రంతా జాగరణ చేయడం మొదలు పెట్టింది.

ఈ నేపథ్యంలో దీపపు కుందుల దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తోన్న ఓ ఎలుకను ఆమె తెల్లవార్లు అదిలిస్తూనే వుంది. తెల్లవారగానే ఆ ఎలుక అందమైన స్త్రీగా మారిపోయింది. పూర్వ జన్మలో తాను చేసిన పాపాల కారణంగానే తాను ఎలుకగా జన్మించాననీ, గోమతి చేసిన వ్రతాన్ని చూడటం వలన ... ఉపవాసం ... జాగరణ వుండటం వలన తన పాపాలు నశించాయంటూ కృతజ్ఞతలు చెప్పి ఆ యువతీ అదృశ్యమై పోయింది. ఇక ఈ వ్రతం చేసుకోలేని వారు ఆ రోజున కపిల గోవును పూజించి ఈ కథ చెప్పుకుని అక్షింతలు తలపై ధరించినా సరిపోతుందని శాస్త్రం చెబుతోంది.

More Bhakti Articles