నందా వ్రతం

నందా వ్రతం
వివాహిత స్త్రీలు తమ సౌభాగ్యాన్ని ... సంతానాన్ని కోరుతూ వ్రతాలు చేస్తుంటారు. ఇక వివాహం కావడం కోసం కన్యలు చేసే వ్రతం కూడా వుంది. తమకి కాబోయే భర్త ఎలా వుండాలని వారు అనుకుంటారో అలాంటి భర్తను ఇచ్చే వ్రతమే 'నందా వ్రతం'. సాక్షాత్తు పరమేశ్వరుడిని వివాహమాడేందుకు పార్వతీదేవి ఆచరించిన వ్రతంగా దీనికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఒక్కోమాసంలో ... ఒక్కో తిధిలో ఆదిదేవుడిని ఆరాధిస్తూ, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తూ అనుగ్రహాన్ని పొందడమే ఈ వ్రతం యొక్క ప్రధాన ఉద్దేశం.

ఇక 'ఆశ్వయుజ పాడ్యమి'నాడు పరమేశ్వరుడిని ఆరాధించి బెల్లంతో చేసిన పరమాన్నం, కార్తీక చతుర్దశి'రోజున పాయసాలను నివేదన చేయాలి. 'మార్గశిర బహుళ అష్టమి'నాడు నువ్వులు కలిపి వండిన అన్నాన్ని సమర్పించాలి. 'పుష్య శుక్ల సప్తమి' ఉదయాన్నే శంకరుడిని పూజించి పులగం నివేదించాలి. 'మాఘపౌర్ణమి' రోజున జాగారం ఉండి మరుసటి ఉదయం మహాదేవుడిని అర్చించాలి. 'ఫాల్గుణ బహుళ చతుర్దశి'నాటి రాత్రి మారేడు పత్రాలతో పూజించాలి.

ఇక 'చైత్ర శుక్ల చతుర్దశి'రోజున మోదుగు పూలతోను ... దవనంతోను ఆరాధించాలి. 'వైశాఖ మాసపు శుక్ల తదియ'నాడు తిలాన్నం నివేదించాలి. 'జ్యేష్ట పౌర్ణమి' రోజున స్వామివారికి నూతన వస్త్రాలు ... 'ఆషాఢ శుక్ల చతుర్దశి'నాడు నల్లని వస్త్రాలు సమర్పించాలి. శ్రావణ మాసంలో శుద్ధ అష్టమి ... చతుర్దశి రోజుల్లో యజ్ఞోపవీతాన్ని ... కొత్త వస్త్రాలను కానుకలుగా ఇవ్వాలి. 'భాద్రపద బహుళ చతుర్దశి' రోజున అరటిపండ్లు నివేదించాలి. 'పునఃఆశ్వీయుజ పౌర్ణమి'రోజున బెల్లం కలిపి వండిన అన్నాన్ని నివేదించాలి.

ఆశ్వయుజ బహుళ పాడ్యమి రోజున బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలను సమర్పించి ఉద్యాపన చెప్పుకోవాలి. ఈ విధంగా ఆదిదేవుడిని భక్తి శ్రద్ధలతో సంతృప్తి కలిగించగలిగితే, కన్యలకు కోరుకున్నవారితో వివాహం జరుగుతుందని ఈ వ్రత విధానం తెలియజేస్తోంది.

More Bhakti Articles