ఎవరేమనుకున్నా సాయిబాబాకి తెలుస్తుందా?

ఎవరేమనుకున్నా సాయిబాబాకి  తెలుస్తుందా?
శిరిడీలోని మశీదుని ఆవాసంగా చేసుకుని సాయిబాబా నిరాడంబరమైన జీవితాన్ని గడపసాగాడు. మొదట్లో ఆయనను పిచ్చి ఫకీరు అనుకున్న వారు, ఆయన తలచుకుంటే అందరికీ అష్టైశ్వర్యాలు ప్రసాదించగలడని తెలుసుకున్నారు. ఆయన చూపు సోకితేనే ఆపదలు ... అనారోగ్యాలు తొలగిపోతాయనే విశ్వాసంతో ఎక్కడెక్కడి నుంచో భక్తులు అక్కడికి వచ్చేవారు.

శిరిడీ మీదుగా అనేక రకాల పనుల మీద వెళ్లే వాళ్లు ... వచ్చే వాళ్లు శిరిడీలో ఆగి ఆయన దర్శనం చేసుకునే వాళ్లు. ఈ నేపథ్యంలో ఒకసారి ఇద్దరు వ్యక్తులు తమ కార్యకలాపాల నిమిత్తం శిరిడీ దాటి వెళ్లవలసి వచ్చింది. అందులో ఒకతను వైద్యుడు కాగా మరోవ్యక్తి చిన్న వ్యాపారి. వెళ్లేటప్పుడు శిరిడీలో ఆగుదామని ఆ వ్యాపారి అనడంతో, అందుకు ఆ వైద్యుడు అయిష్టాన్ని వ్యక్తం చేస్తాడు.

తాను శ్రీరాముడి భక్తుడిననీ, ముస్లీమైన బాబా దగ్గరికి రానని చెబుతాడు. బాబాకి అతను నమస్కరించ వలసిన పనిలేదనీ, తాను దర్శనం చేసుకుని వచ్చేస్తానని ఆ వ్యాపారు ఒప్పిస్తాడు. ఇద్దరూ కలిసి శిరిడీలోని బాబా మశీదు దగ్గరికి చేరుకుంటారు. మశీదు దగ్గరికి చేరుకుంటూనే ఆ వైద్యుడు పరిగెత్తుకు వెళ్లి బాబా పాదాలపై పడతాడు. అతణ్ణి బాబా పైకి లేవదీసి, తాను ముస్లీముననే విషయం మరచిపోయావా ? అంటూ ప్రశ్నిస్తాడు.

ఆ మాటకి ఆ వైద్యుడు ఒక్కసారిగా బిత్తరపోతాడు. మనసులో ఉద్దేశాలు బాబాకి వెంటనే తేలిసిపోతాయనే విషయం అతనికి అర్థమైపోతుంది. తనని మన్నించమంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఆ వైద్యుడిని బాబా ఆశీర్వదిస్తాడు. వ్యాపారి కూడా బాబా దర్శనం చేసుకుని వైద్యుడితో కలిసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. బాబా దగ్గరికి మొదటిసారిగా ... అదీ ఇష్టం లేకుండా వచ్చి, ఒక్కసారిగా ఆయన పాదాలపై పడటం తనకి ఆశ్చర్యాన్ని కలిగించిందని వైద్యుడితో అంటాడు వ్యాపారి.

మశీదు దగ్గరికి వెళ్లగానే తనకి ముందుగా అక్కడ శ్రీరాముడే దర్శనమిచ్చాడనీ ... తాను నమస్కరించుకుని పైకి లేచిన తరువాతనే ఆ స్థానంలో బాబా కనిపించాడని చెబుతాడు వైద్యుడు. అదంతా బాబా లీల అనీ ... ఆయన సకల దైవ స్వరూపమని మరోమారు ఆ వ్యాపారి మనసులోనే బాబాకి నమస్కరించుకుంటాడు. ఆ మాటలను పూర్తిగా విశ్వసిస్తున్నట్టుగా ఆ వైద్యుడు మశీదు వైపుకు తిరిగి మళ్లీ సాష్టాంగ నమస్కారం చేస్తాడు.

More Bhakti Articles