సంతోషాలను ప్రసాదించే దివ్య క్షేత్రం

సంతోషాలను ప్రసాదించే దివ్య క్షేత్రం
భగవంతుడు అన్నీ అందరికీ ఇవ్వడని అనుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో అసంతృప్తి ఉండేలా ఆయన చూస్తుంటాడు. లేకపోతే తన దగ్గరికీ ఎవరూ రారనే విషయం ఆయనకి బాగా తెలుసు. ఐశ్వర్యం ... ఆరోగ్యం ... అధికారం ఉన్నా కొంతమందిలో ఆనందమనేది కనిపించదు. అందుకు కారణం వారికి సంతానం లేకపోవడమే. ఈ ఒక్క సమస్య దంపతులను ... వారి తల్లిదండ్రులను తీవ్రంగా బాధిస్తూ ఉంటుంది.

అందువలన అంతా కలిసి దైవానుగ్రహాన్ని పొందడానికి వివిధ క్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు. అలా సంతానం కోసం దంపతులు దర్శించుకోవలసిన క్షేత్రాల్లో 'బిక్కవోలు' ఒకటి. ఇక్కడే ప్రాచీన కాలంనాటి 'గోలింగేశ్వరస్వామి క్షేత్రం' విలసిల్లుతోంది. గోవు తన పొదుగు నుంచి క్షీర ధారలు కురిపించి, పుట్టలోగల శివలింగం బయటపడేలా చేసింది. ఈ కారణంగానే ఇక్కడి స్వామికి ఈ పేరు వచ్చింది.

విశిష్టమైనటు వంటి ఈ క్షేత్రంలోనే, మహిమగల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం కూడా దర్శనమిస్తుంది. ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామికి చుట్టుపక్కల గ్రామాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సంతానాన్ని ప్రసాదించి దంపతులకి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటారు. ఓ వైపున సుబ్రహ్మణ్య స్వామి సుందరరూపం ... మరోవైపున సహజంగా ఏర్పడిన పాముపుట్ట ఇక్కడ భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ ఉంటాయి.

ఈ పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆలయంలో గల స్వామికి అభిషేకం చేయిస్తే సంతానం కలుగుతుందని చెబుతుంటారు. అలా స్వామి ఆశీస్సుల కారణంగా సంతానాన్ని పొందిన వాళ్లు ఎందరో తమ మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. తమ సంతానానికి స్వామి పేరు పెట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు.

More Bhakti Articles