సంకటహర చతుర్థి రోజున ఏం చేయాలి ?

జీవితమన్నాక ప్రతి ఒక్కరూ కష్టాలతో ... బాధలతో కలిసి ప్రయాణం చేయవలసి వస్తూనే ఉంటుంది. ఒక్కోసారి ఊహించని విధంగా సమస్యలన్నీ కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తుంటాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కోలేక ... అనుకున్న కోరికలు నెరవేరక అసహనానికి లోనవుతుంటారు. ఇలాంటప్పుడు సహజంగానే అందరికీ దేవుడు గుర్తుకు వస్తుంటాడు.

విఘ్నాలు తొలగించేది ... విజయాలను అందించేది వినాయకుడే కాబట్టి, ఎలాంటి కష్టాలు ... ఎటువంటి ఆటంకాలు లేకుండా తమ జీవితం సాఫీగా సాగిపోవాలని అందరూ ఆయననే ప్రార్ధిస్తుంటారు. సాధారణ రోజుల్లో కన్నా 'సంకట హర చతుర్థి' రోజున గణపతిని పూజించినట్టయితే, కష్టాలు కనుమరుగైపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి నెలలోను కృష్ణ పక్షంలో వచ్చే చవితి సంకటహర చవితిగా చెప్పబడుతోంది.

ఈ రోజున 'సంకటహర వ్రతం' నిర్వహించడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ... పూజా మందిరాన్ని అలంకరించి ... ఉపవాస దీక్షను చేపట్టి గణపతికి పూజాభిషేకాలు జరపాలి. స్వామివారికి ఎదురుగా తెల్లని వస్త్రాన్ని పరిచి, ఆ వస్త్రానికి పసుపు కుంకుమలు పెట్టి మనసులోని కోరికను చెప్పుకుంటూ అందులో మూడు దోసిళ్ల బియ్యం పోయాలి. ఆ బియ్యంలో దక్షిణ తాంబూలాలు ఉంచి ముడుపుగట్టాలి. ఆ తరువాత స్వామివారికి ధూప దీపాలు చూపించి నైవేద్యాలు సమర్పించాలి.

ఆ రోజు సాయంత్రం మరలా గణపతిని పూజించి ... నక్షత్ర దర్శనం కాగానే భోజనం చేయాలి. ఎన్ని చవితిల పాటు ఈ వ్రతాన్ని చేయాలనుకున్నారో అంతవరకూ ఆ రోజున ఈ నియమాలను పాటించాలి. చివరి చవితి రోజున ... ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి తయారు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఈ రోజుల్లో గణపతిని పూజిస్తూ ... సేవిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందడం వలన కష్టనష్టాలు దూరమై, ఆశించిన కోరికలు నెరవేరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News