అర్చకులను ఎంపిక చేసుకున్న స్వామి

క్షేత్రమేదైనా ... దైవమేదైనా అక్కడి సన్నిధానంలో అర్చకులు కనిపిస్తూనే వుంటారు. నిత్య పూజలో వాళ్లు దైవానికి అభిషేకాలు ... అలంకరణలు ... హారతులు ... నైవేద్యాలు సమర్పిస్తుంటారు. నిరంతరం దేవుడి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఈ అర్చకులను, వారి సంప్రదాయాలను బట్టి ... విద్యార్హతను బట్టి ఆలయాల్లో నియమిస్తూ ఉంటారు.

అయితే సాక్షాత్తు ఆ దేవుడే తన ఆలయంలో ఫలానా వాళ్లు అర్చకులుగా ఉండాలని చెప్పిన క్షేత్రం మనకి పశ్చిమ గోదావరి జిల్లా 'ఉండి' సమీపంలో గల 'ఉప్పులూరు' లో దర్శనమిస్తుంది. ప్రాచీన కాలంనాటి ఈ క్షేత్రంలో 'చెన్నకేశవస్వామి' పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక ఈ స్వామి పల్నాడు నుంచి ఇక్కడికి తరలి వచ్చాడు. పల్నాడు యుద్ధ సమయంలో స్వామివారి ఆలయంపై దాడి జరగనుందని తెలిసి, కొందరు దళిత సోదరులు స్వామివారి విగ్రహాన్ని రహస్యంగా ఉప్పులూరుకు తీసుకు వచ్చారు.

అదే సమయంలో ఉప్పులూరులో కొన్ని అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అందుకు కారణం దళితుల రాకనే అని కొందరు ప్రచారం చేసి, వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. స్వామిని రక్షించడానికి వచ్చి తాము చిక్కుల్లో పడటం ఆ దళిత సోదరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ రాత్రి ఆ గ్రామపెద్దల కలలో స్వామి కనిపించి, ఆ దళిత సోదరుల మంచి మనసును గురించి చెప్పాడట. ఆ గ్రామంలో తనకి ఆలయాన్ని నిర్మించి, ఆ దళిత సోదరులనే అర్చకులుగా నియమించమని ఆదేశించాడు.

అలా స్వామి ఆదేశం మేరకు 13వ శతాబ్దం ప్రధమార్థంలో ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. స్వామివారి అభీష్టం మేరకు నేటికీ ఆ దళిత సోదరుల వంశస్తులే పూజాభిషేకాలు నిర్వహిస్తూ వస్తున్నారు. మహిమగల ఈ చెన్నకేశవస్వామిని దర్శించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సంపదలు ... విజయాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.


More Bhakti News