సరస్వతీదేవి ఎవరిలా జన్మించింది ?

సరస్వతీదేవి ఎవరిలా జన్మించింది ?
సమస్త విద్యలను ... వాటిని ఆవిష్కరించే వాక్కును ప్రాసాదించే సరస్వతీదేవిని అభిమానించని వాళ్లు ... ఆరాధించని వాళ్లు వుండరు. తెలుపు రంగుని ఎక్కువగా ఇష్టపడే అమ్మవారు, హంస వాహనంపై కూర్చుని వీణ వాయిస్తూ ఉంటుంది. ప్రశాంతమైన వదనంతో ... నిర్మలమైన మందహాసంతో కనిపించే అమ్మవారి పట్ల బ్రహ్మదేవుడికి ఆగ్రహం కలిగిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు.

కారణమేదైనా అమ్మవారికి బ్రహ్మదేవుడు పెట్టిన శాపం, తమిళ సాహిత్య వైభవానికి పాదులు వేసింది. ప్రాచీన తమిళ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన కవులలో 48 మంది ముందువరుసలో కనిపిస్తారు. వీరు తమిళ సాహిత్యాన్ని దశ దిశలా వ్యాపింపజేశారు. తమిళ సాహిత్యపు కీర్తి పతాకను రెపరెపలాడించారు.

ఈ 'తమిళ సంగం'లోని 48 మంది కవులు సరస్వతీదేవి రూపాలని మదురై ప్రజలు విశ్వసిస్తూ వుంటారు. తనకి ఆగ్రహాన్ని కలిగించిన సరస్వతీదేవిని నలభైఎనిమిది మార్లు మానవజన్మనెత్తమని బ్రహ్మదేవుడు శపించాడట. ఆ తరువాత శాంతించి ఆ నలభై ఎనిమిది జన్మలను ఒకేసారి అనుభవించమని శాపాన్ని సడలించాడు. ఫలితంగా అమ్మవారు ఒకేసారి నలభైఎనిమిది మంది కవులుగా అవతరించింది. వారే తమిళ సంగానికి చెందిన కవులని చెబుతుంటారు.

ఇక ఇక్కడి మీనాక్షిదేవి ఆలయం మధ్యలో గల కోనేరును 'కోట్రమరైకులం' అని పిలుస్తారు. 'తమిళ సంగం' కవులు ఓ చెక్కపై కొత్తగా వచ్చిన కావ్యాలను వుంచి, కోనేరులోకి తోసేవారట. ఆ కోనేరులో మునగకుండా వున్న కావ్యాలను ఉత్తమైనవిగా నిర్ణయించేవారని స్థలపురాణం చెబుతోంది.

More Bhakti Articles